– ఘనంగా 1974–76 బ్యాచ్
పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవం
పుంగనూరు: పట్టణంలోని బసవరాజ హైస్కూల్‌లో 1974–1976 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. యాభై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న నాటి మిత్రులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుని, తమ మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులైన ఎంఈవో నటరాజారెడ్డి, విశ్రాంత అధ్యాపకులు షణ్ముగం, హరినాయుడు, సీనియర్ న్యాయవాది మల్లికార్జునరెడ్డి తదితరులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన విశ్రాంత గురువులను శాలువాలు, జ్ఞాపికలతో (మెమెంటోలు) సత్కరించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. గంగులప్పనాయుడు, విశ్రాంత బ్యాంక్ మేనేజర్ మహమ్మదాలి, రవీంద్రనాథ్, దుర్వాసులరెడ్డి, ఇనాయతుల్లా, చంద్ర, రుక్మిణి, శోభారాణి, పద్మావతమ్మ, సుశీలమ్మ, రవికుమార్, ద్వారకనాథరెడ్డి, ఆనందరెడ్డి, భగత్‌కుమార్‌రెడ్డి, రమణల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిత్రులందరూ తమ కుటుంబ, వృత్తి విశేషాలను పంచుకున్నారు. అనంతరం సహపంక్తి విందు భోజనాలు చేసి, తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు ప్రకటించారు.


