సాక్షి, మదనపల్లె : జిల్లాలో కరువు కోరలు చాచింది. పొలాలు బీడువారాయి, చినుకు జాడ లేక భూగర్భ జలాలు అడుగంటాయి. తాగునీటికి సైతం జనం అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణమ్మ అన్నమయ్య జిల్లా వైపు పరుగులు తీస్తోంది. ఏవీఆర్ హంద్రీనీవా సాగు, తాగునీటి ప్రాజెక్టు రెండో దశకు సంబంధించి శనివారం సాయంత్రం సత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను విడుదల చేశారు. అధికారులు పుంగనూరు ఉపకాలువలోకి 200 క్యూసెక్కుల నీటిని వదలడంతో జిల్లా వైపు కృష్ణమ్మ తరలివస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో కృష్ణా జలాలు అన్నమయ్య జిల్లా సరిహద్దును దాటనున్నాయి. అయితే, ఈ నీరు కరువు నేలను తడిపేందుకు సాగుకు అందుతుందా? లేక పట్టణ ప్రజల దాహం తీరుస్తుందా? అని రైతులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.
’ఒక్క’ టీఎంసీతో ఏం సరిపోతుంది?
చెర్లోపల్లె జలాశయం 1.61 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఉండగా, ప్రస్తుతం అందులో ఒక టీఎంసీ నీటి నిల్వ మాత్రమే ఉంది. శ్రీశైలం నుంచి జీడిపల్లి రిజర్వాయర్ మీదుగా చెర్లోపల్లికి ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ సీజన్‌లో కేవలం ఒక టీఎంసీ నీళ్లు మాత్రమే జిల్లాకు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఈ అరకొర నీరు కాలువల తడులకే సరిపోతుందని, ఇక పొలాలకు సాగునీరు అందడం అత్యాశే అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. జిల్లాలో పుంగనూరు ఉపకాలువ (పీబీసీ) 224.5 కిలోమీటర్లు, కుప్పం ఉపకాలువ (కేబీసీ) 131.2 కిలోమీటర్ల మేర (మొత్తం 355.7 కి.మీ) విస్తరించి ఉంది. ఇప్పుడు తరలించే అవకాశం ఉన్న ఒక టీఎంసీ నీళ్లు కేవలం ఈ పొడవైన కాలువను నింపడానికే సరిపోతాయి. దీనికి తోడు ఎండల తీవ్రతకు ప్రవహించే నీరు ఆవిరై నీటి నష్టం భారీగా ఉంటుంది. ఈ తరుణంలో అందుబాటులో ఉన్న ఈ ఒక్క టీఎంసీని కాలువల్లోకి వదిలి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకునేలా కనిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
80,050 ఎకరాలకు సాగునీరిస్తారా?
నిజానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు వైఎస్సార్ కడపలోని రాయచోటి నియోజకవర్గానికి కలిపి 2.86 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల జనాభాకు తాగునీటిని అందించాలి. కానీ ప్రస్తుతం పీబీసీ, కేబీసీలకు మాత్రమే నీటిని ఇస్తున్నందున దీని పరిధిలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో 41,150 ఎకరాలు, పుంగనూరులో 17,800 ఎకరాలు, కుప్పం నియోజకవర్గంలో 10 వేల ఎకరాలు, పలమనేరులో 8,100 ఎకరాలు, మదనపల్లెలో 3 వేల ఎకరాలకు కలిపి మొత్తం 80,050 ఎకరాలకు ఈ దఫా సాగునీరు అందించాల్సి ఉంది.
ఎస్‌ఎస్ ట్యాంకులకై నా నింపుతారా?
మదనపల్లె పట్టణ ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ముందుచూపు లేక నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగానే ఈ సమస్య ఏర్పడింది. గత సీజన్లో చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్ స్టోరేజ్ (ఎస్‌ఎస్) ట్యాంకులకు కృష్ణా జలాలు నింపి ఉంటే ఈరోజు నీటి సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందుచూపుగా వ్యవహరించారు. చిప్పిలి ఎస్‌ఎస్ ట్యాంకును నింపడమే కాకుండా, పుంగనూరులోని పుంగమ్మ ఎస్‌ఎస్ ట్యాంకు, శంకర్రాయలపేట చెరువులను భర్తీ చేశారు.జగనన్న పాలనలో కుప్పానికి నీళ్లు ఇవ్వడమే కాక, ఏకంగా ఆరున్నర టీఎంసీల నీటిని జిల్లాకు తరలించారు. కానీ, ఈ చొరవ సొంత జిల్లాపై చంద్రబాబు చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చిప్పిలి, గుంటివారిపల్లె ఎస్‌ఎస్ ట్యాంకులకు కృష్ణా జలాలు నింపుతామని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇప్పటికే ప్రకటించి పనులు చేపట్టినప్పటికీ.. కృష్ణాజలాల తరలింపు స్థాయి, ప్రస్తుత అవసరాల దృష్ట్యా కరువు ప్రాంతాలకు, మదనపల్లె తాగునీటికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారా అన్నది అనుమానంగానే ఉంది. కరువు ప్రాంతాలను కాదని కృష్ణాజలాలను నేరుగా కుప్పానికి తరలించే అవకాశం లేకపోలేదు అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.
గత సీజన్లో జరిగింది ఇదే..
సొంత నియోజకవర్గంపైనే ప్రేమ!
గత సీజన్లో కృష్ణా జలాలను అందించే విషయంలో చంద్రబాబు నాయుడు కుప్పంపై చూపిన ప్రేమ ఇతర నియోజకవర్గాలపై చూపలేదు. కుప్పం ఉప కాలువకు సంబంధించి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో పేర్కొన్న దానికంటే అదనంగా నీటిని తరలించుకుపోయారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గ రైతుల నోర్లు కొట్టారు. మదనపల్లె పట్టణ ప్రజల దాహం తీర్చే చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీరు ఇవ్వకుండా ద్రోహం చేశారు. దీని ఫలితంగానే ప్రస్తుతం సుమారు రెండు లక్షల జనాభా కలిగిన మదనపల్లె పట్టణం తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరువు, భూగర్భ జలాలు అడుగంటి పోయిన ఎగువ ప్రాంతాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలకు ఈ దఫా అయినా న్యాయం చేస్తారా? లేక ఎప్పటిలాగే కుప్పానికే నీటిని తరలించుకుని పోతారా? అన్నది తేలాల్సి ఉంది.
శనివారం సాయంత్రం చెర్లపల్లె రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు
జిల్లాలోకి వచ్చే పుంగనూరు ఉపకాలువలోకి ప్రవహిస్తున్న కృష్ణాజలాలు
చెర్లోపల్లి నుంచి జిల్లాకు కృష్ణా జలాల విడుదల
ఈ సీజన్‌లో వచ్చేది ఒక్క టీఎంసీ మాత్రమే
నేల తడిపేనా.. దాహం తీర్చేనా!
మదనపల్లె, పుంగనూరు నోరుకొట్టి.. నేరుగా కుప్పానికేనా?
జగనన్న పాలనలో 6.5 టీఎంసీలు.. బాబు హయాంలో కాలువ నిండటమే కష్టం!
మదనపల్లె దాహం తీర్చాలి
మదనపల్లె చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును కృష్ణా జలాలతో తక్షణమే నింపాలి. ప్రజల దాహం తీర్చడానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వం నీటి సమస్యపై ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లే ఈ తీవ్ర నీటి సమస్య ఎదురయింది. కరువుతో ఇబ్బంది పడుతున్న తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో పంటలకు సాగునీరు, ప్రజలకు తాగునీటికి కృష్ణా జలాలను తక్షణమే అందించాలి.
– పి.వి.మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపీ


