చక్రాయపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో అక్రమాలు శృతిమించుతున్నాయి. అర్చకులు చేసే పూజల దగ్గరి నుంచి వాహన పూజలు, హారతి పళ్లెం, కొబ్బరికాయలు, పూలదండల విక్రయాలు, విరాళాల సేకరణ వరకు ప్రతి ఒక్కటీ వివాదాస్పదంగా మారుతోంది. ఇక్కడ ఎవరి తీరు వారిదే అన్నట్లుగా సాగు తుండటంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
లంచం ఇస్తేనే పూజలు..
లేదంటే అవమానాలు
ఆలయానికి వస్తున్న భక్తులు ఆకుపూజ, స్పెషల్ దర్శనం, వీఐపీ దర్శనం టికెట్లు కొనుగోలు చేసి లోపలికి వెళ్లినా.. అక్కడ అదనంగా డబ్బులు ఇస్తేనే పూజలు చేస్తున్నారనే తీవ్ర అపవాదు ఉంది. చివరకు వాహన పూజ టికెట్లు తీసుకున్నా, వాహన మోడల్‌ను బట్టి అదనపు డిమాండ్లు తలెత్తుతున్నాయి. అడిగినంత ఇచ్చుకోకపోతే భక్తుల ను అవమానకరంగా మాట్లాడుతుండటంతో, ఎంతోమంది భక్తులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆలయ తీరును తూర్పారబడుతున్నారు.
హారతి పళ్లెం వసూళ్లు..
బెదిరింపులకు వెరసి సిబ్బంది సరెండర్
ఇటీవల హారతి పళ్లెం వ్యవహారం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. హారతి పళ్లెంలో భక్తులు వేసే కానుకలను ఆలయ హుండీలోనే వేయాలని గతంలో పనిచేసిన డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. దీన్ని పర్యవేక్షించడానికి సీనియర్ అసిస్టెంట్లను కాపలా పెట్టగా.. ఆలయంలోని ఒక ప్రధాన వ్యక్తి ఆగ్రహానికి, బెదిరింపులకు వారు తట్టుకోలేకపోయారు. ’మేము ఈ డ్యూటీ చేయలేం’ అంటూ సదరు సిబ్బంది ఏకంగా ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా రాసివ్వడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. గతంలో వచ్చిన ఫిర్యాదులపై దేవదాయ శాఖ కమిషనర్ సదరు ప్రధాన వ్యక్తిని తీవ్రస్థాయిలో మందలించినా ఆయన తీరు మారలేదు.
ఉద్యోగుల కంటే ఇతర వ్యక్తులదే పెత్తనం
ఆలయంలో అధికారిక సిబ్బంది కంటే అనాధికార వ్యక్తుల పెత్తనం ఎక్కువైంది. పాలక మండలి సభ్యులు, దాతలు, సిబ్బంది బంఛిధువులు వచ్చినా స్వామి దర్శనానికి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆలయ ఉద్యోగుల కంటే ముందే ప్రధాన వ్యక్తికి చెందిన అనధికార వ్యక్తితో పాటు మరో మహిళ క్యూ లైన్ వద్ద నిలబడి భక్తులను ’వంద ఇవ్వు.. లేకుంటే వెనక్కు వెళ్లు’ అంటూ రుబాబులు చేస్తున్నారు. ‘మమ్మల్ని పలానా వాళ్లు పంపారు‘ అని భక్తులు చెబితే.. ‘వాళ్లనే అడిగి వంద తీసుకురా పో‘ అంటూ వెనక్కు పంపిన సంఘటనలు భక్తులను విస్మయానికి గురిచేస్తున్నాయి.
కొబ్బరికాయలు, పూలమాలల దోపిడీ..
వెనుక రాజకీయ ఒత్తిళ్లు
దేవదాయశాఖ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆలయ పరిసరాల్లో కొబ్బరికాయలు, పూలదండలను భారీ ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై భక్తులు గొడవలకు దిగుతున్నా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇస్తే.. రాజకీయ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. గతంలో ఇక్కడ పని చేసిన కొందరు అధికారులు ఈ ఒత్తిళ్లకు లొంగకపోవడంతో ఇబ్బందులు పడి, తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి మల్లగుల్లాలు పడ్డారు.
గండికి దండం’..
సెలవుపై వెళ్లేందుకు ఏసీ సిద్ధం
భక్తుల ఫిర్యాదులకు సమాధానం చెప్పలేక, వారి మనోభావాలను కాపాడలేక ఆలయ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) విశ్వనాథ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తప్పు చేస్తున్న వారిని మందలించినా మార్పు రాకపోగా.. ప్రధాన వ్యక్తి నోటి దురుసు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే ముందుజాగ్రత్తే మేలు.. గండికి దండం పెట్టేసి, దేవదాయ శాఖ కమిషనర్‌కు సమగ్ర నివేదిక ఇచ్చి సుదీర్ఘ సెలవుపై వెళ్లడమే ఉత్తమం‘ అని ఏసీ విశ్వనాథ్ తన అనుయాయుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గత శుక్రవారం విచారణ నిమిత్తం గండి క్షేత్రానికి వచ్చిన ఆర్జేసి ఎదుట కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించడం ఆలయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
ఇక్కడ ఎవరి తీరు వారిదే.. దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు
అదనపు వసూళ్లు, దళారుల పెత్తనంపై భక్తుల ఆగ్రహం
రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక సెలవుకు సిద్ధమైన ఏసీ విశ్వనాథ్!


