చూడముచ్చటగా నిలిచి కనువిందు చేస్తున్న ఈ జాతీయ పక్షుల సందడి వెనుక ఒక తీరని వేదన దాగుంది. గాలివీడు మండలంలోని పలు గ్రామాలలో వ్యవసాయ పొలాల వద్ద నెమళ్లు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. అడవుల్లో ఆహారం, తాగునీరు కరువవడంతోనే ఈ మూగజీవాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇలా పల్లెలకు, పొలాల బాట పడుతున్నాయి. ఉదయం నిద్రలేవగానే రైతులు, ఉపాధి కూలీల కళ్లముందు దేవతామూర్తులుగా ఈ నెమళ్లు సాక్షాత్కరిస్తున్నా.. వాటి భద్రతపైనే ఇప్పుడు అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. అడవి దాటి వస్తున్న ఈ పక్షులకు వేటగాళ్ల ముఠాల నుంచి, వీధి కుక్కల దాడి నుంచి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. అటవీ శాఖ అధికారులు ఇప్పటికై నా తక్షణమే స్పందించి, నెమళ్లు సంచరించే ప్రాంతాలలో నీటి వసతి, రక్షణ చర్యలు చేపట్టి వాటి మనుగడను కాపాడాలని మండల ప్రజలు, రైతాంగం గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
– ప్రభాకర్, గాలివీడు


