● రోడ్డు నిర్మాణంపై స్టేటస్ కో
● అధికారులు యథావిధిగా పనులు
● కంట్మెంట్ కేసు వేస్తామంటున్న పిటిషనర్లు
పుంగనూరు : అధికారులు చట్టవిరుద్ధంగా చేస్తున్న రోడ్డు పనులను ఉన్న స్థితిలో ఆపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ అధికారులు వాటిని లెక్కచేయకుండా పనులు కొనసాగించడంపై పిటిషనర్లు కంట్మెంట్ కేసు దాఖలు చేస్తామని తెలిపిన సంఘటన శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. సదుం మండల కేంద్రంలో నంజంపేట క్రాస్ మార్గం నుంచి హైస్కూల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు లేకుండా రోడ్డు పనులు ప్రారంభించడంతో డ్రైనేజీ నీరు రహదారులపైన, ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని, దీని ద్వారా అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని ఆ గ్రామ వాసులు పూజారిరెడ్డి భరత్, వెంకటరమణ, గంగరాజు, కమాల్‌సాహెబ్ సయ్యద్‌బాషాలు కలసి ఈ నెల 20న హైకోర్టులో ప్రభుత్వాన్ని, అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్‌ఈఆర్‌అండ్‌బీ, ఈఈ ఆర్‌అండ్‌బీతోపాటు సదుం పంచాయతీ కార్యదర్శి, శ్రీబాలాజి కన్‌స్ట్రక్షన్స్ యాజమాన్యం పై రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పూర్వాపరాలు, ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది. పనులను తక్షణమే యథాస్థితిలో నిలిపివేయాలని స్టేటస్ కో జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను అందుకున్న అధికారులు.. అయినా ఆ పనులను యథావిధిగా నిర్వహిస్తూ, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. ఈ విషయమై పిటిషనర్లు మాట్లాడుతూ పనులను నిర్వహించడంపై హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేస్తామని తెలిపారు. అధికారులు తమ ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పనులు చేస్తే ఫలితం ఏముందని నిలదీశారు. ఈ విషయమై అధికారులను వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా.. వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం.


