అధికారమే అండ.. కబ్జా కాండ | - | Sakshi
Sakshi News home page

అధికారమే అండ.. కబ్జా కాండ

Aug 22 2026 1:41 AM | Updated on Aug 22 2026 1:41 AM

టీడీపీ నాయకుల బరితెగింపు

వైఎస్సార్‌సీపీ నేత భూమి ఆక్రమణ

అధికారులకు ఫిర్యాదు

గాలివీడు : అధికారమే అండగా టీడీపీ నాయకులు కబ్జా కాండకు పాల్పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. ఫిర్యాదు చేసినా.. అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఇదే అదునుగా వారు చెలరేగిపోతున్నారు. గోపనపల్లి గ్రామం నక్కలవాండ్లపల్లి సమీపంలో ఇరుగులమ్మ దేవస్థానం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకుడు కుడుముల భయ్యారెడ్డికి చెందిన 40 సెంట్ల భూమిని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో మండల స్థాయి రెవెన్యూ అధికారులు భూమిని పరిశీలించి హద్దులు కూడా కేటాయించారు. ఇరు వర్గాలకు సమస్య లేకుండా పరిష్కరించారు. అయినప్పటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్నాము కదా అని తెగబడ్డారు. సర్వే నంబర్‌ 171లో మూడు ఎకరాల 5 సెంట్లకు పైగా ఉండగా.. భయ్యారెడ్డికి 150 సెంట్లు, మిగతా భూమి తన సమీప బంధువు కుడుముల సరోజమ్మ పేరుతో ఉంది. భూమి హక్కులు పూర్తి స్థాయిలో వారికి ఉన్నాయి. ఇది వారు పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న పట్టా భూమి.

పక్కన పొలం ఉండటంతో..

పడమర పక్కన ఉన్న అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా రెండు రోజుల నుంచి భూమిలోకి ప్రవేశించి యంత్రాల సాయంతో చింత చెట్లను తొలగించారు. భూమిని చదును చేశారు. భూమి యజమాని భయ్యారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ విషయాన్ని మండల రెవెన్యూ అధికారులకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు. గోపనపల్లి గ్రామంలో తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు పరిష్కారం మార్గం చూపడంలో ఆలస్యం చేయడం ఏమిటి అని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాగైతే గ్రామాలలో బతకడం కష్టమవుతుందని, ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని కోరారు. దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement