చక్రాయపేట : అంజన్న క్షేత్రం ఉత్సవ శోభితమైంది. విద్యుత్ దీపాల వెలుగుతో కాంతులీనుతోంది. గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో నేడు రెండవ శ్రావణమాస శనివారోత్సవం జరుగనుంది. గత వారం కంటే ఈవారం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని భావించిన ఆలయ వర్గాలు అందుకు సరిపడా ఏర్పాట్లను సిద్ధం చేశారు. గత వారంలో తలెత్తిన చిన్నచిన్న లోపాలను సరిదిద్ది ఉత్సవాలకు తగు ఏర్పాట్లు చేశామని ఆలయ సహాయ కమిషనర్ సి.విశ్వనాథ్, చైర్మన్ వెంకటస్వామి తెలిపారు. భక్తుల అంచనాల మేరకు లడ్డూ, పులిహోర ప్రసాదాలను సిద్ధం చేసినట్లు వారు తెలిపారు. 10 వేల మందికి పైగా ఆలయం తరఫున అన్న ప్రసాదం చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి ప్రసాదాన్ని అందించే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాపాఘ్ని నదిలో భక్తుల స్నానాలకు షవర్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా కాలువ తవ్వించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతసేవ, ఉత్సవమూర్తులకు అభిషేకం (ఏకాంతంగా), అలంకరణ, ఆరాదన, 5 గంటలకు మహామంగళ హారతి, అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం ఉంటుందని ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు తెలిపారు. రాత్రి బస చేయు భక్తులకు కాలక్షేప నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు సహాయ కమిషనర్ వివరించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు అధికారులు సహకరించాలని ఆయన కోరారు. రెండవ శనివారోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు శుక్రవారం సాయంత్రానికే పెద్ద ఎత్తున గండికి చేరుకున్నారు.
రక్తదానం
రక్తదానం చేసి అపాయంలో ఉన్న ఇతరుల ప్రాణాలను కాపాడాలని ట్రిపుల్ ఐటీకి చెందిన ప్రసాద్ తెలిపారు. గండిలో రక్తదాన శిబిరం కడప రిమ్స్ వారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని, రక్తదాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.
నేడు గండిలో రెండో శ్రావణ
శనివారోత్సవం
పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు
ఘనంగా ఏర్పాట్లు


