రాయచోటి టౌన్ : తప్పిపోయిన బాలుడిని కేవలం గంట వ్యవధిలో తల్లిదండ్రులకు రాయచోటి అర్బన్ పోలీసులు అప్పగించారు. అర్బన్ సీఐ బివి చలపతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని గంగమ్మ వీధికి చెందిన జయరాములు తన కుమారుడు లోకేష్‌ను మందలించాడు. దీంతో ఈ బాలుడు మనస్తాపానికి గురై ఇంటిలో నుంచి వెళ్లి పోయాడు. అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ చండ్రాయుడికి వెతికే బాధ్యత సీఐ అప్పగించడంతో ఆయన సాంకేతిక పరిజ్ఞానంతో ( సీసీ కెమెరాల సహాయంతో) జగనన్న కాలనీ వైపు వెళ్లినట్లు నిర్ధారించుకొని అక్కడికి చేరుకున్నారు. అక్కడ కనిపించిన బాలుడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్టేషన్‌లో బాలుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు.
వాల్మీకిపురం : బైకు టైరు అకస్మాత్తుగా పంఛర్ కావడంతో అదుపుతప్పి లారీని ఢీకొనడంతో.. ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి బోగంపల్లి రిజర్వాయర్ సమీపంలోని మదనపల్లి – తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్యారంపల్లికి చెందిన నరసింహారెడ్డి(32) మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హోటల్‌లో పనులు ముగించుకొని గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంలో సొంత గ్రామానికి బయల్దేరాడు. మార్గంమధ్యలోని బోగంపల్లి రిజర్వాయర్ సమీపంలో టైరు పంఛర్ కావడంతో ప్రమాదవశాత్తు లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బంగారు నగల చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
కేవీపల్లె : బంగారు నగల చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ వెంకటశివకుమార్ తెలిపారు. వివరాలిలా వున్నాయి. మండలంలోని లక్ష్మీరెడ్డిగారిపల్లెకు చెందిన నాజర్‌బాషా ఇంటిలో ఈ నెల 17న 77 గ్రాముల బంగారు నగలు చోరీ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేవీపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాజర్‌బాషా ఇంటికి తరచూ వచ్చివెళ్లే అదే గ్రామానికి చెందిన అప్సానాపై అనుమానంతో విచారణ జరపగా చోరీ చేసినట్లు వెల్లడైంది. చోరీ చేసిన నగలను ఆమె పీలేరు పట్ట ణం కట్టుకాలువ వీధిలో కాపురమున్న ఖాజా, సలీమాలకు ఇవ్వడంతో.. వారు 40 గ్రాముల బంగారం ఓ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టగా మరో 33.8 గ్రాములు బంగారం వారి వద్దే ఉంచుకున్నట్లు గుర్తించారు. శుక్రవారం బంగారం స్వాధీనం చేసుకుని నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు.


