బద్వేలు: దురదృష్టం నెత్తికెక్కి కూర్చున్నప్పుడు గాజు ముక్క కూడా వజ్రం కంటే కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ, ఆ భ్రమల నుంచి బయటపడే లోపే కొందరి బతుకులు తెల్లారిపోతాయి. సరిగ్గా ఇలాంటి ఘరానా ఉపాధి ఉచ్చు ఒకటి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ పెను సంచలనం సృష్టిస్తోంది. వంట పాత్రలను శుభ్రం చేసే స్క్రబ్బర్లను ప్యాకింగ్ చేసి ఇస్తే, కూర్చున్న చోటే వేలల్లో సంపాదించుకోవచ్చంటూ సామాన్య మధ్యతరగతి మహిళల, నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని సాగించిన కోట్ల రూపాయల ఘరానా కుంభకోణం పోలీసుల దర్యాప్తులో అధికారికంగా బట్టబయలైంది. విజయవాడ కేంద్రంగా ‘మాషా అల్లా’, మదనపల్లె వేదికగా ‘స్క్రబ్‌ఎక్స్’ సంస్థలు వేర్వేరు పేర్లతో ఒకే తరహా దోపిడీకి పాల్పడ్డాయి.
విజయవాడ కేంద్రంగా కుట్ర..
భార్యాభర్తల ‘ఆంకుశం’ దందా
కృష్ణా జిల్లా కానూరుకు చెందిన పసుపులేటి అంకుశం రాజా, అతని భార్య సుమ దంపతులు ‘మాషా అల్లా ఎంటర్‌ప్రైజెస్’ మోసానికి ప్రధాన సూత్రధారులు.
వీరు విజయవాడ సత్యనారాయణపురంలో ముఖ్య కార్యాలయాన్ని తెరిచి, మరో నలుగురు డైరెక్టర్లతో కలిసి ఈ ఉపాధి ఉచ్చును సృష్టించారు. రంగంలోకి దిగిన పోలీసులు వీరి ఆరు ప్రధాన బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా, ఏకంగా రూ.32 కోట్ల మేర భారీ లావాదేవీలు సాగినట్లు అధికారికంగా గుర్తించారు.
‘స్క్రబ్‌ఎక్స్’ పేరిట మదనపల్లెలో
మరో రూ.5 కోట్ల దోపిడీ
ఇదే తరుణంలో మదనపల్లె కేంద్రంగా ‘స్క్రబ్‌ఎక్స్’ పేరుతో సాగిన మరో బోగస్ కంపెనీ కోట్ల రూపాయల మోసం వెలుగులోకి వచ్చింది. అమాయక ప్రజల దగ్గర సుమారు రూ.5 కోట్లకు పైగా డబ్బులు కాజేసి, బోర్డు తిప్పేసిన సదరు కంపెనీ సీఈఓ, నెల్లూరుకు చెందిన తిరుమల కొండ రమేష్‌ను ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో ఎస్‌ఐ నాగేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు.
ఆశల వల.. అంకుశం నిబంధనలు ఇవీ!
ఇంటి వద్దనే ఉంటూ సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చనే ఆశ చూపిన ఈ ముఠాలు, బాధితులను నిలువునా ముంచడానికి ఒకే రకమైన పక్కా వ్యూహా న్ని అమలు చేశాయి. ప్యాకింగ్ మిషన్ పేరిట రూ. 30,000, సెక్యూరిటీ డిపాజిట్ కింద మరో రూ.1 లక్ష కలిపి మొత్తం రూ.1.30 లక్షలు కట్టించుకునేవారు. ఈ మొత్తానికి సరిపడా స్క్రబ్బర్లు, బ్రాండెడ్ కవర్లను ఇ చ్చి, వాటిని ప్యాకింగ్ చేసి ఇస్తే ప్రతి నెల రూ.24,000 వేతనంగా ఇస్తామని నమ్మబలికారు. చైన్ సిస్టమ్ పద్ధతిలో మరికొందరిని చేర్పిస్తే అదనంగా కమిషన్లు, ఏజెంట్లకు విదేశీ ప్రయాణాలు చేయించి నమ్మకం కుదిర్చారు. దీంతో మహిళలు ఇళ్లలోని బంగారు నగలను తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చి కట్టారు.
నాలుగు రాష్ట్రాలకు విస్తరణ..
ఈ మాయాజాలం రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా కర్ణాటకలోని రాయచూర్, తమిళనాడు సరిహద్దులకూ దావానలంలా పాకింది. క్షేత్రస్థాయి రికార్డుల ప్రకారం కరీంనగర్‌లో అత్యధికంగా రూ.15 కోట్ల వరకు మోసం జరిగింది. వైఎస్సార్ కడప జిల్లాలో కడప నగరం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు పరిసర ప్రాంతాల్లో వందలాది మంది మహిళల నుంచి రూ.6 కోట్ల వరకు వసూలు చేశారు. బాధితుల్లో అత్యధికులు ఈ జిల్లా వారే కావడం గమనార్హం. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో మదనపల్లె, రాయచోటి, పీలేరు, పలమనేరు, బి.కొత్తకోట, ములకలచెరువు ప్రాంతాల గ్రామీణ మహిళల నుంచి దాదాపు రూ.8 కోట్ల పైచిలుకు డిపాజిట్లను ఈ ముఠాలు నొక్కేసాయి. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. చివరకు జూలైలో డ్రైఫ్రూట్స్ ప్యాకింగ్ పేరుతో మళ్లీ డబ్బులు గుంజి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి పరారయ్యారు.
అకౌంట్ల ఫ్రీజ్.. పోలీసుల ‘ఆంకుశం’!
‘మాషా అల్లా’ దందాను విస్తరించడం కోసం నియమించిన మొత్తం 62 మంది డిస్ట్రిబ్యూటర్ల బ్యాంక్ ఖాతాలను పోలీసులు తక్షణమే ఫ్రీజ్ చేసి వారి లావాదేవీలను వడపోస్తున్నారు. ‘మాషా అల్లా’ సృష్టికర్త అయిన అంకుశం రాజాను, అతని భార్య సుమలను.. అలాగే ‘స్క్రబ్‌ఎక్స్’ సీఈఓ తిరుమల కొండ రమేష్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కుంభకోణం విలువ మొత్తం కలిపి రూ.100 కోట్ల పైచిలుకే ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ ప్రకటనలు, నకిలీ సర్టిఫికెట్లను నమ్మి ప్రజలు అప్పులు చేసి మరీ డబ్బులు కట్టవద్దని పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
స్కృబ్బర్లు ప్యాకింగ్ చేసే యంత్రం
ప్యాకింగ్‌కు సిద్దంగా ఉన్న వంట పాత్రలు శుభ్రం చేసే స్కృబ్బర్లు
‘పీచు’ ప్యాకింగ్ మాయాజాలం
లక్ష డిపాజిట్.. రూ.30 వేల మిషన్.. నెలకు రూ.24 వేల వేతనంతో ఘరానా వల
ఆరు అకౌంట్లలో రూ.32 కోట్ల
లావాదేవీలు.. 1,939 మంది బాధితులు నిలువునా మునక
62 మంది డిస్ట్రిబ్యూటర్ల ఖాతాలు ఫ్రీజ్
‘మాషా అల్లా’ అంకుశం దంపతులతో పాటు ‘స్క్రబ్‌ఎక్స్’ సీఈఓ రమేష్ అరెస్ట్
ఇలాంటి ఫేక్ బిజినెస్‌ల(స్కృబ్ ప్యాకింగ్,పెన్ ప్యాకింగ్,కొవ్వొ త్తుల తయారీ,దూది వత్తుల తయారీ తదితరాలు) సృష్టి కర్తలు వివిధ మాధ్యమాల్లో వర్క్ ప్రం హోం అంటూ ఆకర్షణీయమైన ప్రకటలను నమ్మి ఎవరూ ఆడ్వాన్స్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ల పేరిట డబ్బులు చెల్లించవద్దని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ మరియు లోకల్ పోలీసులు హెచ్చరించారు.


