మైదుకూరు : బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతోందనే ఆవేదనతో శుక్రవారం స్థానిక విద్యుత్ ఏఈ కార్యాలయం వద్ద చాపాడు మండలానికి చెందిన బుర్రి నాగరాజు అనే సబ్ కాంట్రాక్టర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. బిల్లుల కోసమే కార్యాలయానికి వచ్చిన మరి కొందరు కాంట్రాక్టర్లు.. నాగరాజును అడ్డుకొని పెట్రోల్ సీసాను లాక్కొని పారవేశారు. చాపాడు మండలం నెరవాడకు చెందిన నాగరాజు విద్యుత్ స్తంభాలు వేయడం, ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడం వంటి పనులను సబ్ కాంట్రాక్టు తీసుకుని చేపట్టాడు. రూ.30 లక్షలు రావాల్సి ఉండగా ఆలస్యం కావడంతో.. పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతోందనే ఆవేదనతో ఈ చర్యకు పాల్పడ్డాడు. నాగరాజుతోపాటు మైదుకూరు, దువ్వూరు మండలాలకు చెందిన మరో నలుగురు సబ్ కాంట్రాక్టర్లకు రూ.కోటి 50 లక్షల మేరకు బిల్లులు రావాల్సి ఉందని తెలుస్తోంది. దీనిపై ఏఈ రామభద్రయ్య మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల బిల్లుల చెల్లింపులో ఆలస్యమైందని, పది రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.
అంచనా ప్రకారం పనులు చేపట్టకనే..
ఈ సంఘటనపై ఏడీఈ శ్రీకాంత్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై ఆ కాంట్రాక్టర్ వ్యక్తిగతంగా తన పేరు చెప్పడం బాధాకరమని ఏడీఈ పేర్కొన్నారు. మైదుకూరు సబ్ డివిజన్‌లో ముఖ్యంగా మైదుకూరు, చాపాడు, వనిపెంట సెక్షన్లలో ఎక్కువ శాతం పరికరాలు వాడకపోయినా, అంచనా ప్రకారం పనులు చేపట్టకపోయినా, ఫీల్డ్‌లో పనులు జరగకపోయినా.. అధికారి బిల్లులు చేసి తనకు పంపించడం వల్లే తాను వెనక్కు పంపినట్టు వివరించారు. తనవైపు ఎటువంటి తప్పిదం లేకున్నా తన పేరు వాడటం అనాలోచిత చర్య అని పేర్కొన్నారు.
బిల్లుల చెల్లింపులో జాప్యంతో ఘటన


