● షార్ట్ సర్క్యూట్‌తో మంటలు, పొగ
● త్రుటిలో తప్పిన ప్రమాదం
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలంలో శుక్రవారం ఆటోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. ఆటో మంటల్లో తగలబడకుండా స్థానికులు ఆర్పి వేయడంతో.. ప్రాణనష్టం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వలసపల్లె కాలనీకి చెందిన బాషా ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మదనపల్లెలో ప్రయాణికులను ఎక్కించుకుని బోయకొండ వైపు బయల్దేరాడు. వలసపల్లెలోని నవోదయ స్కూల్ సమీపానికి రాగానే ఆటో నుంచి ఉన్నట్లుండి పొగలు రావడం ప్రారంభమైంది. పరిస్థితి గమనించిన డ్రైవర్ బాషా వెంటనే ఆటోను ఆపి ప్రయాణికులను క్షేమంగా కిందికి దించేశాడు. అదే సమయంలో స్థానికులు నీరు, ఇసుకతో మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆటోలో స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్య్కూట్ కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


