తోతాపురితో నష్ట పోయాం
పులిచెర్ల(కల్లూరు) : కాయలమ్మిన చోటే కట్టెలమ్ముకున్నట్టు ఉంది.. ప్రస్తుతం మామిడి రైతుల పరిస్థితి. ఆరుగాలం శ్రమించి టన్నుల కొద్ది దిగుబడి సాధించి మార్కెట్‌కు తరలించిన రైతులు, ఇప్పుడు తోటల్లోని చెట్లను తొలగించి కాయల స్థానే కట్టెలమ్ముకుంటున్నారు. ఏళ్ల తతరబడి రైతులకు ఆర్థికంగా సామాజికంగా భరోసా ఇచ్చిన మామిడి తోటలు ఇప్పుడు భారంగా మారాయి. వరసగా మూడేళ్లు తోతాపురి మామిడికి గిట్టుబాటు లేదు. కనీసం కూలీల ఖర్చులు కూడా రావడం లేదు. ఏటా నష్టాలను మిగుల్చుతున్న మామిడి సాగు పట్ల రైతులు విరక్తి చెందుతున్నారు. పూత దశ నుంచి పంట దిగుబడి, విక్రయం వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంతోపాటు యాజమాన్య ఖర్చులు తడిసి మోపెడవుతుండటం, అధిక దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో పెట్టుబడి కూడా రాక చెట్లను నరికేస్తున్నారు.
సంక్షోభంలో మామిడి రైతు
మండలంలో తోతాపురి మామిడి కాయల రైతుల పరిస్థితి దీనంగా మారింది. మూడేళ్లుగా కనీస ధర లేక రైతులు చెట్లకే కాయలు వదిలేయడం, కొందరు రైతులు రోడ్డు పక్క పారబోస్తున్నారు. మండల వ్యాప్తంగా తోతాపురి రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఎగుమతికి ఖాదర్, బెనీషా, తోతాపురి రకాలను గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేసి యూరప్, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. మూడేళ్ల క్రితం తోతాపురిని యాజమన్యాలు చౌకగా కొనుగోలు చేసి గుజ్జుగా మార్చాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పిడుగు పట్టయింది. రెండేళ్ల క్రితం ఆడించిన గుజ్జు పరిస్థితి అంతే. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో పరిశ్రమలు మరింత సంక్షోభంలోకి కూరుకుపోయాయి. టన్నుల కొద్ది పరిశ్రమల్లో గుజ్జు పేరుకుపోయింది. దీంతో ఈ ఏడాది తోతాపురిని కొనుగోలు చేసేందుకు పరిశ్రమల యజమానులు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వమైనా మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందా అంటే అదీ లేదు. దీంతో రూ.లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు నిలువుగా మునిగిపోయారు.
250 ఎకరాల్లో మామిడి చెట్లు నరికివేత
మండలవ్యాప్తంగా ఈ ఏడాది మామిడిని 15 వేల ఎకరాల్లో సాగు చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో అత్యధికంగా మామిడి తోపులు ఉన్న మండలంగా పులిచెర్లకు పేరుంది. దీంతో ఎక్కువ మంది రైతులకు మామిడి పంటే జీవనాధారం. మొత్తం విస్తీర్ణంలో సగం తోతాపురే అధికంగా ఉంది. ప్రస్తుతం తోతాపురిని అడిగే వారే లేరు. ధర లేక పోవడం ఫ్యాక్టరీలకు తోలినా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. 50 ఏళ్లు పైబడిన తోతాపురి చెట్లను ఇప్పుడు రైతులు విధిలేక కట్టెలకు అమ్మేస్తున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 250 ఎకరాల్లో మామిడి చెట్లను నరికివేశారు. ఆరుగాలం కష్టపడి పంటను పండించినా రైతుల కడుపు నిండని పరిస్థితి నెలకొంది. తోటను కాపాడుకొందామనుకుంటే పెట్టుబడి భారమవుతోంది. ఈ క్రమంలో రైతులు ఆవేదనతో ఎంతో ఫలసాయాన్ని ఇచ్చిన తోటను జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు.
తోతాపురి పంట సాగు చేసి తీరా ధరలు లేక నష్ట పోయాం. 5 ఎకరాల్లో తోతాపురి రకాన్ని సాగు చేశాను. రెండేళ్లుగా కేజీ కేవలం రూ.2 మాత్రమే ధర పలుకుతోంది. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. దీంతో కన్నబిడ్డాల్లా కాపాడుకుంటూ వస్తున్న చెట్లను నరికేస్తున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం మామడి సాగు చేసిన రైతులను ఆదుకోవాలి. – కె.కిష్ణయ్య,
రైతు, శ్రీనివాసపురం, పులిచెర్ల మండలం
కాయలు అమ్మిన చోటే..
కట్టెలమ్ముతున్నారు..
వరసగా మూడేళ్లు కాత కాయని మామిడి తోటలు
పెట్టుబడులు రాక చెట్లు నరికేస్తున్న రైతులు


