పెద్దతిప్పసముద్రం: మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కాంటాక్ట్ పద్ధతిలో టీచర్ల నియామకం కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ నారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని కమ్మచెరువు, కందుకూరు, చెన్నరాయునిపల్లి, గుగ్గిళ్ళపల్లిలోని ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (వలంటీర్) పోస్టు భర్తీ చేస్తున్నామన్నారు. టెట్, టీటీసీ పూర్తి చేసి కాంటాక్ట్ పద్దతిన పని చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 19 లోపు దరఖాస్తులను ఎంఆర్‌సీలో అందజేయాలని సూచించారు.
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులకు..
మదనపల్లె సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. ఇందులో ఎస్‌జీటీ 122, ఎస్‌ఏ 45 పోస్టులు ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 16 నుంచి 21వతేదీలోపు దరఖాస్తులు ఆయా మండల విద్యా అధికారులకు అందజేయాలన్నారు. ఎంపికై న అభ్యర్థులు సెప్టెంబర్ నెల నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు కాలపరిమితి వరకు తాత్కాలికంగా నియమితులవుతారన్నారు. స్కూల్ అసిస్టెంట్‌లకు నెలకు రూ.12,500, సెకండరీ గ్రేడ్ పోసులకు రూ.10,000 గౌరవ భృతి ఇస్తారన్నారు.దరఖాస్తులు సంబంధిత మండల విద్యాశాఖ కార్యాలయంలో పొందవచ్చునన్నారు.
ఫిన్‌లాండ్‌కు జిల్లా ఉపాధ్యాయురాలు
పుంగనూరు: మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్ పాఠశాల ఉపాధ్యాయురాలు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సి.హేమలత ఫిన్‌లాండ్ దేశంలో అమలు చేస్తున్న విద్యా విధానాలు పరిశీలించేందుకు శుక్రవారం వెళ్లారు. ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఫిన్‌లాండ్‌లోని తుర్కు యూనివర్సిటీలో ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణా కార్యక్రమంలో 29 మంది ఉపాధ్యాయులు రాష్ట్రం నుంచి పాల్గొంటున్నారు. ఈబృందంలో హేమత ఉన్నారని ఎంఈవోలు నటరాజరెడ్డి, రెడ్డెన్నశెట్టి తెలిపారు.
డీఎంహెచ్‌ఓ సస్పెన్షన్
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్యను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. 2025లో మదనపల్లె గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవాడకు చెందిన సాడి యమున కిడ్నీ రాకెట్ కేసులో నిర్లక్ష్యం చేయడం, ఈ కేసులో బాధ్యులపై జిల్లా వైద్యశాఖ నుంచి చర్యలు లేకపోవడం, కేసు నమోదు చేయకుండా వ్యవహరించారన్న అభియోగాలపై డీఎంహెచ్‌ఓపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీరపాండ్యన్ శుక్రవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఆదేశాలు విజయవాడ నుంచి నేరుగా జిల్లా డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా చేరాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అంతర్జాతీయ జర్నల్ ఎడిటర్‌గా ప్రొఫెసర్ సందీప్ కుమార్
మదనపల్లె సిటీ: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ కుమార్ గుప్తాకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘నేచర్ పోర్ట్‌ఫోలియో’ ప్రచురించే అంతర్జాతీయ అకాడమిక్ జర్నల్ ‘హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కమ్యూనికేషన్స్’కు ఆయన ఎడిటర్‌గా నామినేట్ అయ్యారు. సామాజిక శాస్త్రాల రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పరిశోధనా జర్నల్‌గా దీనికి గుర్తింపు ఉంది. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ సందీప్ కుమార్ ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీలో హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ విభాగాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన రాసిన 150కు పైగా పరిశోధనా పత్రాలను జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించారు. బోధనతో పాటు పరిశోధనా రంగంలో ఆయన చేస్తున్న విశేష కృషికి ఈ అంతర్జాతీయ బాధ్యతలు లభించడం విద్యా రంగంలో గర్వించదగ్గ విషయమని పలువురు విద్యావేత్తలు కొనియాడారు. ఈ అరుదైన గుర్తింపు పట్ల మోహన్ బాబు యూనివర్సిటీ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ సందీప్ కుమార్ గుప్తాను ఘనంగా అభినందించారు.


