నిబద్ధతతో నిలిచే కార్యకర్తలే పార్టీకి బలం | - | Sakshi
Sakshi News home page

నిబద్ధతతో నిలిచే కార్యకర్తలే పార్టీకి బలం

Jul 20 2026 1:26 AM | Updated on Jul 20 2026 1:26 AM

రాయచోటి అర్బన్‌ : రాజకీయాల్లో కండువాలు మార్చుకోవడం , స్వార్థపరులు, జంప్‌ జిలానీలు పార్టీలు మారడం గొప్ప విషయం కాదని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎంత అభివృద్ధి ,సంక్షేమం చేశామన్నదే రాజకీయాలకు అసలైన కొలమానమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలను వివరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడే వారితో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి నష్టం ఉండదని , పార్టీని నమ్మి కష్టకాలంలో అండగా నిలిచిన వారే రేపటి నాయకులని అన్నారు. పార్టీ ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని , అనేక కీలక పదవులు, సముచిత గౌరవాలు కల్పించిందని ఆయన గుర్తుచేశారు. గ్రామాలు , వార్డుల్లో యువతలో ప్రజా సేవ పట్ల ఆసక్తి ఉన్న వారిని , నిబద్ధతతో ప్రజజల కోసం పనిచేసే నాయకత్వాన్ని తయారు చేసి స్వార్థ రాజకీయాలు చేసే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. గత స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నారంటే టీడీపీకి స్థానిక ఎన్నికల్లో వారే దిక్కు అయినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.

● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీల సాధికారత కోసం చరిత్రాత్మకంగా 57 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి డైరెక్టర్లు , వేలాది మందికి అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడుకు బీసీల కోసం 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా రాలేదని విమర్శించారు. జగన్‌ హయాంలో వచ్చిన జీవోతోనే ఇప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ల పదవులను భర్తీ చేశారన్నారు. రాయచోటి ప్రాంతంలో కూడా బడుగు, బలహీన వర్గాలకు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్‌ చైర్మన్‌ కానీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు వంటి అనేక పదవులు కల్పించామని తెలిపారు. వడ్డెర్లకు రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్లు, పాల ఏకరి, మత్స్యకార , కురబ సామాజిక వర్గాలకు , మైనార్టీ సామాజిక వర్గాలకు కూడా రాష్ట్ర స్థాయి అవకాశాలు ఇచ్చామని గుర్తు చేశారు. మాట ఇచ్చినట్లుగానే మైనార్టీలకు ఎమ్మెల్సీతో పాటు డిప్యూటీ చైర్మన్‌ పదవిని కూడా వైఎస్సార్‌సీపీ కల్పించిందని పేర్కొన్నారు. ఓ దళిత మహిళకు శ్రీశైలం బోర్డు మెంబర్‌గా ఇచ్చిన ఘనత గత జగన్‌ ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ విధంగా మీరు చేయగలుగుతారా అని ఆయన ప్రశ్నించారు.

● గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ఇళ్లపై దాడులు చేశారని , ఇళ్లలోపలికి వచ్చి మహిళలను సైతం అవమానించారని, ఆస్తులను ధ్వంసం చేశారని, వ్యక్తిగతంగా హించించారని చెప్పిన వారే ఈ రోజు అదే పార్టీలో చేరడం ప్రజలు గమనిస్తూ ఉన్నారని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం చేసిన అభివృద్ధి , సంక్షేమం గురించి చెప్పుకోవాలే కానీ, కండువాలు మార్చాం...మాకు బలం పెరిగిందని చెప్పుకునేవారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఎంత మందిని పార్టీలో చేర్చుకున్నామనేది రాజకీయ విజయానికి కొలమానం కాదని శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

– వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement