పాము కాటుతో వ్యక్తికి అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

పాము కాటుతో వ్యక్తికి అస్వస్థత

Jul 20 2026 1:26 AM | Updated on Jul 20 2026 1:26 AM

పాము కాటుతో వ్యక్తికి అస్వస్థత జూదరుల అరెస్టు రెడ్డెమ్మా.. చల్లంగా చూడమ్మా యువకుడు ఆత్మహత్యాయత్నం

మదనపల్లె టౌన్‌: పాము కాటుతో వ్యక్తి అస్వస్థతకు గురైన సంఘటన ఆదివారం మదనపల్లి మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని వలసపల్లెకు చెందిన ఖాదరబాషా (40), స్కూటర్‌ మెకానిక్‌ పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం తన వ్యవసాయ బోరు వద్దకు వెళ్లిన అతన్ని విష సర్పం కాటేసింది. కుటుంబ సభ్యులు గమనించి అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.వైద్యులు చికిత్స అందించ డంతో కోలుకుంటూ ఉన్నాడు. అలాగే వేర్వేరు ప్రాంతాలకు చెందిన మరో నలుగురిని విష సర్పాలు కాటేయడంతో స్థానిక జిల్లా ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందారు.

సంబేపల్లె : మండల పరిధిలోని గున్నికుంట్ల పంచాయతీ లో పేకాట స్థావరంపై ఎస్‌ఐ రవికుమార్‌ తమ సిబ్బందితో ఆదివారం దాడులు నిర్వహించారు. 10మంది జూదరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 50,180 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.అరెస్ట్‌ చేసిన వారిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు.కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు.

మదనపల్లె టౌన్‌: ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తోబుట్టువు దొంగిలించుకుని వెళ్లిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మండలంలోని రామాపురం పంచాయతీ, కొత్తపల్లికి చెందిన నరసింహులు కుమారుడు సంతోష్‌ కుమార్‌ (19). తల్లిదండ్రులు చనిపోవడంతో అతనికి పినతల్లి కుమార్తె విజయలక్ష్మి చేదోడు వాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో విజయలక్ష్మి సంతోష్‌ కుమార్‌కు చెందిన బంగారు ఆభరణాలను తీసుకుని వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న సంతోష్‌ తన అక్క విజయలక్ష్మిని నిలదీయగా, ఆమె అతడిని దూషించిందని తెలిపాడు. దీంతో మనస్తాపానికి గురైన సంతోష్‌ కుమార్‌ పురుగులమందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని 108 అంబులెన్‌న్స్‌లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గుర్రంకొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement