మదనపల్లె టౌన్: మదనపల్లె పుంగనూరు రోడ్డు, బసినికొండ బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ యువకుడిపై ప్రత్యర్తులు కత్తితో గొంతుకోసి హత్యాయత్నాకి పాల్పడ్డారు. ఈ ఘటన కలకలం రేపింది.. తాలూకా పోలీసుల కథనం మేరకు ..పట్టణంలోని నక్కలదిన్నెకు చెందిన భాస్కర్ (35) భార్య బసినికొండలోని పుట్టినింటికి ఇటీవల వెళ్లిపోయిందన్నారు.భాస్కర్ బసినికొండకు వచ్చి, భార్యను కాపురానికి రావాలని గొడవ పడిన సంఘటనలు ఉన్నాయన్నారు. కాగా ఆదివారం రాత్రి నక్కలదిన్నెలో ఉన్న భాస్కర్‌కు బసినికొండలో ఉంటున్న రఫి, చిన్నా ఫోన్ చేసి మాట్లాడే పని ఉందని బైపాస్ రోడ్డుకు సమీపానికి రప్పించారు. అక్కడ భాస్కర్‌తో రఫి, చిన్నా మధ్య జరిగిన ఘర్షణ తారస్థాయికి చేరడంతో ఒకరిపై మరొకరు పరస్పర దాడులకు దిగి కొట్టుకున్నారు. ఈ క్రమంలో నిందితులు ముందుగానే వెంట తెచ్చుకున్న మచ్చు కత్తితో భాస్కర్ గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయారని స్థానికులు ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో భాస్కర్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు అతన్ని స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు రుయారు రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షలే ఈ దాడికి కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.హత్యా యత్నానికి పాల్పడిన యువకుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


