టెన్త్‌ టాపర్లకు షైనింగ్‌ స్టార్‌ అవార్డులు | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ టాపర్లకు షైనింగ్‌ స్టార్‌ అవార్డులు

Jul 18 2026 3:47 AM | Updated on Jul 18 2026 3:47 AM

మదనపల్లె సిటీ: జిల్లా వ్యాప్తంగా గత విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 157 మందికి షైనింగ్‌ స్టార్‌ అవార్డులు ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికా రి డాక్టర్‌ సుబ్రమణ్యం శుక్రవారం తెలిపారు. ఈ నెల 20వ తేదీ స్థానిక ఎన్‌జీఆర్‌ కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో వీరికి రూ.20 వేలు నగదు, పతకం అందజేస్తామన్నారు.

ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలి

రాయచోటి టౌన్‌ : ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో –ఆర్డినేటర్‌ కొండూరు శ్రీనివాస రాజు తెలిపారు. శుక్రవారం రాయచోటి డైట్‌ కళాశాలలో ఓపెన్‌ స్కూల్‌ 2026–2027 సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాలను విడదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు పూర్తయి, చదవడానికి, రాయడానికి వచ్చిన వారు పదోతరగతిలో ప్రవేశానికి అర్హులని చెప్పారు. అలాగే 15 సంవత్సరాలు నిండిన వార ఇంటర్మీడియట్‌ చేరేందుకు అర్హులని తెలిపారు. వీరికి ఉచితంగా స్వయం అభ్యాస పాఠ్యసామగ్రి ఇంటికే పంపించనున్నట్లు చెప్పారు.ఎలాంటి అపరాధ రుసుం చెల్లించకుండా ఈ నెల 31లోగా ఏపీ ఆన్‌లైన్‌ ప్రవేశాలు పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో డైట్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ మడితాటి నరసింహారెడ్డి, డైట్‌ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆశాజనకంగా టమాట ధరలు

సాక్షి, మదనపల్లె: సీజన్‌ ముగుస్తున్నా టమోటా ధరలు ఆశాజనకంగా ఉండగా దిగుబడి కూడా భారీగా పెరిగింది. దీంతో పనులు కూడా తగ్గకుండా ఉన్నాయి. మదనపల్లి మార్కెట్లో శుక్రవారం 1,451 టన్నుల టమాట రాగా అత్యధికంగా కిలో ధర రూ.18 పలికింది. ఇదే మార్కెట్లో సోమవారం 1,210 టన్నుల టమాట అనగా అత్యధిక కిలో ధర రూ.19 పలికింది. మంగళవారం 1,190 టన్నుల టమాట రాగా అత్యధికంగా కిలో ధర రూ.23 పలికింది. బుధవారం 1,340 టన్నుల టమాట రాగా అత్యధిక కిలో ధర రూ.23 పలికింది. గురువారం 1,478 టన్నుల టమాట విక్రయానికి రాగా అత్యధిక కిలో ధర రూ.20 పలికింది. దీన్ని బట్టి చూస్తే ఈ నెలలో అత్యధిక ధర కిలో రూ.23 పలికితే, అత్యల్ప ధర రూ.18 పలికింది. టమోటా దిగుబడి ఇంకా పెరుగుతుండటంతో ధరలు ఇలాగే నిలకడగా ఉంటాయా లేదా అన్నది చూడాలి.

కేసులు సత్వరమే

పరిష్కరించాలి: డీఐజీ

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ శుక్రవారం తనిఖీ చేశారు. శుక్రవారం మదనపల్లెకు విచ్చేసిన డీఐజీకి జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి, అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) వెంకటాద్రి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో జరుగుతున్న నూతన భవన నిర్మాణ పనులను డీఐజీ పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ రికార్డులు, పెండింగ్‌ కేసుల వివరాలను సమీక్షించి డీఐజీ.. కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్‌ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.

పిల్లలకు తప్పనిసరిగా

టీకా వేయించాలి

మదనపల్లె టౌన్‌: మీసిల్స్‌, రూబెల్లా (పొంగు, మూడు రోజుల తట్టు) వ్యాధుల నివారణకు నిర్వహిస్తున్న టీకాల ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ లక్ష్మీనరసయ్య, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ ఉషశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లె డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. 9 నెలల నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలందరికీ మీసిల్స్‌–రూబెల్లా (ఎంఆర్‌) టీకా తప్పనిసరిగా వేయించాలన్నారు. గతంలో టీకా వేయించినా సరే, ప్రత్యేక శిబిరాల్లో మరో అదనపు డోసు ఇస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం 2026 డిసెంబర్‌ నాటికి దేశం నుంచి మీసిల్స్‌, రూబెల్లా వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని వారు పేర్కొన్నారు. ఈ లక్ష్యం సాధనకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement