రిత్వికారెడ్డి చేతన్‌రెడ్డి షేక్ నూర్ ఉల్ హేస్సేన్ మోహిత్ రోహిత్
మదనపల్లె సిటీ: వైద్య,విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్(యూజీ) పునః పరీక్ష ఫలితాల్లో మదనపల్లెకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మంచి ర్యాంకులు సాధించారు.
సత్తా చాటిన రిత్వికారెడ్డి
లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో శ్రమిస్తే విజయాన్ని ఎవరూ ఆపలేరని మదనపల్లెకు చెందిన రిత్వాకారెడ్డి నిరూపించారు. నీట్ ప్రవేశ ఫలితాల్లో 652 మార్కులు సాధించి ఆల్ ఇండియా 1311 ర్యాంకు సాధించింది. ఇంటర్మీడియట్ విజాయవాడలోని ప్రైవేటు కాలేజీలో చదివింది. రిత్వికరెడ్డి తల్లిదండ్రులు డాక్టర్ ఎస్.రామలింగారెడ్డి, సునీత. రామలింగారెడ్డి మదనపల్లెలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్‌గా ఉన్నారు. నీట్ పరీక్షకు క్రమబద్దంగా సిద్దమై ప్రతి రోజూ ప్రణాళిక ప్రకారం చదవడం , మాక్ టెస్టులు రాయడం, పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వడం, సమయాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవడంతో తన విజయానికి దోహదపడిందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకం ఉపయోగపడినట్లు తెలిపారు.
చేతన్‌రెడ్డి ప్రతిభ
గ్రామీణ ప్రాంతమైన తంబళ్లపల్లెకు చెందిన సీతి చేతన్‌రెడ్డి నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 591 మార్కులు సాధించి 13041 ర్యాంకు దక్కించుకున్నారు. తంబళ్లపల్లెకు చెందిన మెడికల్‌స్టోర్ యజమాని నారాయణరెడ్డి, పల్లవి తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి మదనపల్లెలో విద్యాభ్యాసం చేశారు. ఇంటర్మీడియట్ తిరుపతిలోని ప్రైవేటు కాలేజీలో చదివారు. మొదటి ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించారు. కార్డియాలజిస్టు కావడమే తన ధ్యేయమన్నారు.
నూర్‌కు ర్యాంకు
నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మదనపల్లె పట్టణం ఇందిరానగర్‌కు చెందిన షేక్ మహమ్మద్ నూర్ ఉల్ హుస్సేన్ 665 మార్కులు సాధించి 663 ర్యాంకు దక్కించుకున్నారు. తల్లిదండ్రులు డాక్టర్ అలీ, తస్కిన్. తండ్రి దంత వైద్యులు కావడంతో చిన్నప్పటి నుంచి నూర్‌ను ప్రోత్సహించాడు. తండ్రి సహకారంతో విద్యలో రాణించాడు. మొదటి ప్రయత్నంలోనే 663 ర్యాంకు సాధించి అందరి మన్ననలు పొందారు. కార్డియాలజిస్టు కావడము తన లక్ష్యమన్నారు.
మోహిత్‌కు 36 వేల ర్యాంకు
పుంగనూరు: పట్టణంలోని బెస్తవీధికి చెందిన మంజుల కుమారుడు బి.మోహిత్ నీట్ ఫలితాలలో 36 వేల ర్యాంకు సాధించాడు. 750 మార్కులకు 550 మార్కులను సాధించాడు. అలాగే క్యాటగిరి కోటాలో 18 వేల ర్యాంకు సాధించాడు. మోహిత్ తండ్రి చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి మంజుల పాలవ్యాపారం చేస్తూ కుమారుడిని చదివించింది. ఈసందర్భంగా స్నేహితులు మోహిత్‌కు అభినందనలు తెలిపారు.
రోహిత్ సత్తా..
పీలేరు : నీట్ పరీక్షా ఫలితాల్లో పీలేరుకు చెందిన రోహిత్ అనే విద్యార్థి ఆల్ ఇండియా ర్యాంక్‌లో 316 సాధించి ప్రతిభను చాటాడు. పీలేరుకు చెందిన ఉపాధ్యాయులు పరమేశ్వర్‌రాజు, విజయలక్ష్మీ కుమారుడు రోహిత్ 720 మార్కులకు 680 మార్కులు సాధించి ఆల్ ఇండియా ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్‌ను పలువురు అభినందించారు.


