● కడపలో మొదలు.. రాష్ట్రమంతా కేసులు
● ప్రభుత్వానికి పట్టని
కరోనా ప్రమాద సంకేతాలు
కడప రూరల్ : వైఎస్సార్ జిల్లాలో జూలై మొదటి వారం నుంచి కరోనా కేసులు మొదలయ్యాయి. ఇప్పుడు రాష్ట్రమంతా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మాటల్లోనే అని, చేతల్లో కనిపించడం లేదనే అభిప్రాయం కలుగుతోంది.
విస్తరిస్తున్న కోవిడ్
వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు వెలుగు చూశాయి. అందులో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. వల్లూరు మండలానికి చెందిన 66 ఏళ్ల వద్ధుడు మరణించాడు. ఆ వ్యక్తి కిడ్నీ వ్యాధిగ్రస్తుడని, డయాలసిస్ చికిత్స పొందుతూ తిరుపతిలో మరణించాడని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం సాయంత్రం నాటికి మొత్తం 14 కేసులకు పైగా వెలుగు చూశాయి. ఈ కేసులన్నీ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, వెస్ట్, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో నమోదయ్యాయి. ఇక్కడ పరిశీలించాల్సిన అంశం ఏమంటే 2020 మార్చి నెలలో రాష్ట్రం అంతా కేసులు వెలుగు చూశాయి. వైఎస్సార్ కడప జిల్లా మినహా రాయలసీమ జిల్లాల్లో పాజిటివ్ కేసులు విరివిగా నమోదయినాయి. కడపలో మాత్రం ఆ ఏడాది మార్చి 30న కేసులు నమోదు కావడం మొదలైంది. అంటే ఇక్కడ ఆలస్యంగా పాజిటివ్ కేసులు వచ్చాయి. కాగా ఈ కేసులకు సంబంధించి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
సమస్యగా మారిన నిర్ధారణ
జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలు కోవిడ్‌ను పోలి ఉంటాయి. ఈ లక్షణాలు సర్వసాధారణంగా చాలామందిలోనే కనిపిస్తాయి. అలాగని అందరినీ కరోనా కింద జమ కట్టలేం. నిర్ధారణ పరీక్షల ద్వారా పాజిటివ్ వస్తే కోవిడ్ గా పరిగణించడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో కరోనా వచ్చినప్పుడు రాపిడ్ కిట్స్, ట్రూనాట్, ఆర్టిపీసీఆర్ ద్వారా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. వీటిల్లో ఆర్టిపీసీఆర్ ద్వారా జరిపే పరీక్షలు మెరుగైనవని వైద్యుల అభిప్రాయం. అయితే ప్రాథమికంగా ఒక అంచనాకు రావడానికి రాపిడ్ కిట్స్, ట్రూ నాట్ పరీక్షలు ఉపయోగపరంగా ఉంటాయి. అయితే ఈ పరీక్ష పరికరాలు ఇంతవరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరని పరిస్థితి నెలకొంది. అలాంటప్పుడు వ్యాధి నిర్ధారణ కాకముందే, కరోనాను ఎలా కనిపెట్టగలరనే ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా వ్యాధులు చలికాలం, వానాకాలంలో వెలుగు చూస్తాయి. అయితే కరోనా కేసులు మాత్రం ఎండల్లో నమోదు కావడం విశేషం. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి దృష్టి పెట్టకుండా, కరోనా మహమ్మారిపై కరుణ చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2020లో లాగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోయినా పర్వాలేదు. కరోనా విస్తరించకుండా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటే చాలని సగటు మనిషి అభిప్రాయపడుతున్నాడు.


