సాక్షి, మదనపల్లె: రాబోవు పదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రకృతి సేద్యం విస్తరింపజేయడమే రైతు సాధికార సంస్థ లక్ష్యమని సంస్థ సీనియర్ అడ్వైజర్ మురళీ తెలిపారు. మదనపల్లె మండలంలోని అంకిశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ సెంటర్ సందర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, భూసారాన్ని పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రకృతి ఆధారిత సాగు పద్ధతులను అవలంబించడం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులతో పాటు ఖర్చులు తగ్గుతాయని వివరించారు.అనంతరం జిల్లా ప్రాజెక్టు నిర్వహణ విభాగం కార్యాలయంలో మెంటార్లు, రైతు శాస్త్రవేత్తలు, యువ రైతు సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సహాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకట మోహన్, వ్యవసాయ శాఖ అధికారులు, పులివెందుల అకాడమీ ప్రతినిధులు, రైతు సాధికార సంస్థ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ క్షేత్రస్థాయి సిబ్బంది, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


