బలమైన పార్లమెంటరీ వ్యవస్థతోనే ప్రాంతీయ సహకారం సాధ్యం | - | Sakshi
Sakshi News home page

బలమైన పార్లమెంటరీ వ్యవస్థతోనే ప్రాంతీయ సహకారం సాధ్యం

Jul 18 2026 3:47 AM | Updated on Jul 18 2026 3:47 AM

బలమైన పార్లమెంటరీ వ్యవస్థతోనే ప్రాంతీయ సహకారం సాధ్యం

దక్షిణాసియా అధ్యయన పర్యటన

ఫలవంతం

వాతావరణం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలపై పరస్పర సహకారం

ప్రతినిధుల బృంద ప్రతినిధి

ఎంపీ మిథున్‌రెడ్డి

సాక్షి, మదనపల్లె : బలమైన పార్లమెంటరీ వ్యవస్థతోనే దేశాల మధ్య ప్రాంతీయ సహకారం సాధ్యమవుతుందన్న అభిప్రాయంతో సింగపూర్‌, ఇండోనేషియాలో జరిగిన అధ్యయన పర్యటన తెలియజేసిందని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అన్నారు. ఈ నెల 12 నుంచి 16 వరకు ద్వారా విధాన రూపకల్పన నుండి ఆచరణ వరకు సింగపూర్‌, ఇండోనేషియా అనుసరిస్తున్న వినూత్న విధానాలను దక్షిణాసియా దేశాల పార్లమెంటేరియన్లు అధ్యయనం చేసే అవకాశం లభించిందని అన్నారు. పర్యటన ముగిసిన సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ సింగపూర్‌, ఇండోనేషియాలో జరిగిన అధ్యయన పర్యటనలో బంగ్లాదేశ్‌, భూటాన్‌, భారతదేశం, నేపాల్‌, శ్రీలంక దేశాల పార్లమెంటేరియన్లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిథుల బృందంలో మనదేశం తరపున తాను భాగస్వామి అయ్యానని చెప్పారు. సింగపూర్‌, ఇండోనేషియాలోని ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థలు, ఆర్థిక సంస్థలతో జరిగిన సమావేశాల ద్వారా వాతావరణ చర్యలు, ఇంధన పరివర్తన, స్థిరత్వం కోసం సాంకేతికత, విధాన ఆవిష్కరణలు, ప్రాంతీయ సహకారంపై పార్లమెంటరీ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అధ్యయన సమావేశాలు, చర్చలు జరిగాయన్నారు. ఈ చర్చల్లో ప్రాంతీయ సమైక్యత, సహకార విధాన రూపకల్పనలోని అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడం ద్వారా, సాక్ష్యాధారిత విధానాలు, బలమైన పార్లమెంటరీ నెట్‌వర్క్‌లు మరియు దక్షిణాసియాను స్థిరమైన, తక్కువ–కార్బన్‌ మరియు సుస్థిర భవిష్యత్తు వైపు నడిపించే ఆచరణాత్మక పరిష్కారాలను ఈ అధ్యయన పర్యటన ప్రోత్సహిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సింగపూర్‌ సస్టైనబిలిటీ, ఎన్విరాన్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ అధికారులు సింగపూర్‌ గ్రీన్‌ ప్లాన్‌–2050 నాటికి నెట్‌–జీరో సాధించే రోడ్‌మ్యాప్‌ గురించి తెలుసుకున్నట్టు వివరించారు. సస్టైనబుల్‌ సింగపూర్‌ గ్యాలరీ, వరద నివారణ కట్టడం, జలాశయం, పార్క్‌, గ్రీన్‌ రూఫ్‌గా ఉపయోగపడే మెరీనా బ్యారేజ్‌, దేశ వాతావరణ వ్యూహాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో ప్రత్యక్షంగా పరిశీలించామన్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ హబ్‌ను సందర్శించి డీకార్బనైజేషన్‌, క్లీన్‌ ఎనర్జీ టెక్నాలజీలపై జరుగుతున్న అత్యాధునిక పరిశోధనలను ల్యాబ్‌ టూర్ల ద్వారా పరిశీలించామన్నారు. ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌లో జరిగిన చర్చ, రౌండ్‌ టేబుల్‌లో జరిగిన కీలక ప్రసంగాల్లో భాగమై మనదేశం తరపున ఆ వేదికపై అభిప్రాయాలను పంచుకున్నట్టు తెలిపారు. ఈ పర్యటన ఫలవంతమైందని, మనదేశం పొరుగు దేశాలతో కోరుకుంటున్న ప్రాంతీయ సహకారం, పరస్పర అవగాహన, మిత్రత్వం గురించి వేదికలపై ప్రసంగించడం జరిగిందని చెప్పారు. ఈ అధ్యయన పర్యటన దక్షిణాసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరం పెరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement