మదనపల్లె టౌన్ : మద్యం మత్తులో లారీ యజమానిపై డ్రైవర్ బీరు బాటిల్‌తో దాడి చేసి గాయపరిచాడు. అర్ధరాత్రి మదనపల్లిలో జరిగిన ఘటనపై బాధితుడి కుటుంబీకులు, పోలీసుల కథనం.. బసినికొండలో కాపురం ఉంటున్న విజయభాస్కర్ నాయుడు(42)కు లారీలు ఉన్నాయి. స్థానిక సాయిబాబా మందిరం సమీపంలోని షెడ్డు వద్ద లారీ ఉండగా అక్కడికి వెళ్లాడు. డ్రైవర్ అక్బర్‌తో కలసి మద్యం తాగాడు. ఇంతలో ఇద్దరి మధ్య చిన్న వివాదం తలెత్తి బీరు బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో విజయభాస్కర్ నాయుడుకు తీవ్ర గాయాలు కాగా అక్బర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
● ఇద్దరికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : అర్ధరాత్రి కారు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముదివేడు ఎస్‌ఐ మధురామ చంద్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన శ్యాం కుమార్ (23), కోడూరుకు చెందిన వెంకటరమణ(41) కారులో ముందు సీట్లో, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్న పిల్లలు వెనుక సీట్లో కూర్చొని బెంగళూరుకు వెళ్తున్నారు. మార్గంమధ్యలోని కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ వచ్చింది. ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయి, అందులో ప్రయాణిస్తున్న శ్యాంకుమార్, వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను కురబలకోట 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


