మదనపల్లె సిటీ : విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఎం.గీత అన్నారు. శుక్రవారం స్థానిక వలసపల్లి వద్దనున్న నవోదయ విద్యాలయంలో క్లస్టర్ స్థాయి విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి సైన్సు పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఎగ్జిబిట్‌లో పాల్గొని తమ ప్రతిభ చూపాలన్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రదర్శనలో స్థానిక నవోదయ విద్యాలయంతోపాటు కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, మార్కాపురం, కారేకల్, పుదుచ్చేరికి చెందిన విద్యాలయాల నుంచి 59 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యాలయ అధ్యాపకులు శైలజ,. శారదా, జగదీష్‌కుమార్, శ్రీనివాసమూర్తి, వెంకటేశులు, సుమతి, కౌన్సిలర్ శంకరప్ప, తదితరులు పాల్గొన్నారు.
ఎగ్జిబిట్‌లో ప్రదర్శనలు
సుస్థిర వ్యవసాయం, వ్యర్థపదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు ప్రత్నామ్యాయం, గ్రీన్ ఎనర్జీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదాత్మక గణిత నమూనాలు, మంచి ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ, నిర్వహణపై ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. శనివారం ముగింపులో విజేతలను ప్రకటిస్తామని ప్రిన్సిపాల్ గీత తెలిపారు.


