మదనపల్లె టౌన్: వివాహిత విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని వలసగుట్లపల్లికి చెందిన చంద్ర భార్య మమత (40) కొంతకాలంగా కుటుంబ కలహాలతో బాధపడుతోంది. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. పిల్లలు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మమతను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్పందించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం మమత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కురబలకోట: ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న ఏఐ యుగంలో విద్యార్థులు ఉన్నతంగా రాణించాలన్నా జీవితంలో విజయం సాధించాలన్నా ఏఐ ఆధారిత నైపుణ్యాలను తప్పనిసరిగా అలవర్చుకోవాలని బెంగళూరులోని హెచ్‌ఆర్‌ఎఫ్‌వై కంపెనీ డైరెక్టర్ మనోజ్ కుమార్ సోడా వెల్లడించారు. అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో కళాశాల క్యాంపస్ నుంచి కార్పొరేట్ ప్రపంచానికి అంశంపై జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడుతూ డిగ్రీతో పాటు కార్పొరేట్ స్కిల్స్ సాధించాలన్నారు. పరిశ్రమల్లో ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మలచుకుంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. విజయవంతమైన కేరీర్ నిర్మాణానికి కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సమస్యలు పరిష్కరించే సామర్థ్యం అవసరమన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏఐ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని మిట్స్ యూనివర్సిటీ అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ జి. నాగశ్వేత అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ నేర్చుకోవడం ద్వారా జీవితంలో రాణింపునకు దోహదపడుతుందన్నారు.


