నకిలీనారుతో మోసపోయిన రైతు | - | Sakshi
Sakshi News home page

నకిలీనారుతో మోసపోయిన రైతు

Jul 16 2026 5:06 AM | Updated on Jul 16 2026 5:06 AM

నకిలీనారుతో మోసపోయిన రైతు ఆదుకోకుంటే ఆత్మహత్యశరణ్యం...

చౌడేపల్లె: ఆరుగాలం కష్టపడి అప్పులు తెచ్చి పంట సాగుకు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన రైతులకు నకిలీల బెడదతో పంట దిగుబడి రాక నష్టపోయిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్యజిల్లా చౌడేపల్లె మండలం కాగతి పంచాయతీ యనమసామనపల్లెలో రైతు గంగరాజు గ్రామానికి సమీపంలోని కుందిలేనికుంట బండ కాడచేను సమీపంలో సుమారు ఐదు ఎకరాల్లో టమాటా సాగు చేయాలనుకున్నాడు. తమ గ్రామానికి సమీపంలోని యల్లంపల్లెవద్ద ఓ టమోటా నర్సరీ నుంచి జయహో రకం, నారు సుమారు 35 వేల టమాటా మొలకలను కొనుగోలు చేశాడు.ఐదు ఎకరాల్లో పంట సాగుకోసం అవసరమైన సేంద్రియ ఎరువులు, పెట్టుబడులకోసం సుమారు 12 లక్షలు ఖర్చుచేసి పంట సాగుచేశాడు. టమాటా మొలకలు నాటినప్పటినుంచి కోత దశకు వచ్చేవరకు సక్రమంగా మందులు పిచికారీ చేసినా పంట దిగుబడి ఆశించినంత స్థాయిలో రాలేదని రైతు తెలిపాడు. తమ పక్క పొలంలో మిగిలిన రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడితోపాటు కాయ సైజులు వచ్చాయన్నారు. ఐదుఎకరాల్లో సుమారు 2వేల టమాటా బాక్స్‌లు కాయలు కోతకు రావాల్సి ఉండగా కేవలం 500 బాక్స్‌లు మాత్రమే వచ్చాయని,వాటిల్లో కూడా కాయలు సైజు చిన్నవిగా రావడంతో మార్కెట్‌లో ధర పలకలేదని, దీంతో పొలంలోనే పడేస్తున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 250 నుంచి 270 వరకు ధర పలుకుతుంటే చిన్నసైజు కాయలు రూ.90 పలుకుతోందన్నారు., పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉంటే సుమారు రూ.20 నుంచి రూ.30 లక్షలు ఆదాయం వచ్చేదన్నారు. ఇలాంటి ఘటనలే తమ గ్రామంలో చోటుచేసుకున్నాయి. కొందరు రైతులు నర్సరీ నిర్వాహకుడి ప్రశ్నించలేక మిన్నకుండిపోయారని ఆరోపణలున్నాయి. నర్సరీ నిర్వాహకుడిని రైతు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం ఇస్తూ తప్పించుకొన్నాడని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. నకిలీ విత్తనాలతో మోసపోయామని గ్రహించిన రైతు మీడియాను ఆశ్రయించి తమ ఆవేదన తెలిపాడు.

పత్తాలేని హార్టీకల్చర్‌ అధికారిణి....

మండలంలో ప్రతి మేటా 4వేలనుంచి 8 వేల ఎకరాల్లో టమాటా పంటను రైతులు సాగుచేస్తున్నారు. అయితే హార్టికల్చర్‌ శాఖ నుంచి ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలు, ఎరువులు, మల్చింగ్‌ వంటి సేవలు అందించే వారు లేరు. కనీసం సమాచారమిచ్చే వారు లేకపోయారు. హార్టికల్చర్‌ అఽధికారిణి ఎప్పుడూ అందుబాటులో ఉండరు. ఉన్నప్పటికీ ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. పర్యవేక్షణలేక మండలంలో ఇష్టానుసారంగా నర్సరీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయని రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

నకిలీ విత్తనాలతో టమాటా పంట సాగు చేసినా ఆశించిన స్థాయిలో పంట దిగుబడిలేదు. కాయలన్నీ చిన్నసైజు గోలీలుగా ఉండడంతో మార్కెట్‌లో కొనుగోలుచేసేవారు కరువయ్యారు. సుమారు 12లక్షల పెట్టుబడి ఖర్చు పెట్టినా పైసా రాలేదు.. ఇలాగైతే అప్పులు ఎలా తీర్చాలి. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం.

– గంగరాజు, బాధిత రైతు, యనమసామనపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement