అప్పట్లో ఆర్భాటంగా లేఖలు పంచిన చంద్రబాబు సర్కార్ ఆ టిడ్కో నిర్మాణాలను పూర్తి చేయకుండా ఏడేళ్లకు పైగా లబ్ధిదారులను ఇళ్ల కోసం ఎదురుచూసేలా చేసింది. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో పాటు అంతకుముందే పనులు చేపట్టకపోవడంతో లబ్ధిదారుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. పెండింగ్‌లో ఉన్న పోతబోలు టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఇస్తారని ఆశించిన పేదలకు చంద్రబాబు సర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ‘మీకు ఇచ్చేందుకు ఇక్కడ టిడ్కో ఇళ్లు లేవు.. మీరు కట్టిన పాత డిపాజిట్లు వెనక్కు తీసుకుని వెళ్లిపోండి‘ అంటూ మున్సిపల్ అధికారుల ద్వారా నిర్ధాక్షిణ్యంగా ఆదేశాలు జారీ చేయించింది. దాంతో ఆశలు వదులుకున్న పేదలు తాము కట్టిన డిపాజిట్ సొమ్మునైనా వెనక్కు తీసుకుందామని మదనపల్లె మున్సిపల్ కార్యాలయానికి తరలివస్తున్నారు.


