ఉద్యమించిన ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

ఉద్యమించిన ఉపాధ్యాయులు

Jul 15 2026 1:10 AM | Updated on Jul 15 2026 1:10 AM

సాక్షి, మదనపల్లె : దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని విద్యారంగ, ఆర్థికపరమైన సమస్యలపై అన్నమయ్య జిల్లా ఉపాధ్యాయ లోకం మంగళవారం ఉగ్రరూపం దాల్చింది. ప్రభుత్వ ఉదాసీన వైఖరి, నిర్లక్ష్యపూరిత ధోరణికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు భారీ ఎత్తున గళమెత్తారు. ‘ప్రభుత్వం మెడలు వంచైనా సరే మా న్యాయమైన డిమాండ్లు సాధించుకుంటాం‘ అంటూ ఉపాధ్యాయులు చేసిన నినాదాలతో మదనపల్లె పట్టణం హోరెత్తింది. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు మంగళవారం ఉదయమే మదనపల్లెకు తరలివచ్చారు. ఆందోళనలో భాగంగా ఉపాధ్యాయులంతా తొలుత మదనపల్లెలోని మిషన్‌ కాంపౌండ్‌ వద్దకు చేరుకుని ఒక్కసారిగా ప్రధాన రహదారిపై బైఠాయించి, చేతుల్లో ప్లకార్డులు పట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పాలక ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదని, కాలయాపన చేస్తూ ఇంకెంత సమయం వృథా చేస్తారని నిలదీశారు. మిషన్‌ కాంపౌండ్‌ వద్ద బైఠాయింపు అనంతరం ఉపాధ్యాయులు భారీ ప్రదర్శనగా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ వైపు దూసుకెళ్లి, కలెక్టరేట్‌ ముఖద్వారం ఎదుట గంటల తరబడి ధర్నా నిర్వహించి ముట్టడించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర, జిల్లా సంఘ నేతలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన ఆర్థిక, వృత్తిపరమైన భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. తక్షణమే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, వేతన సవరణ జాప్యమైనందుకు గాను 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీ, సరెండర్‌ లీవ్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని తగిన విధంగా సవరించి, ప్రస్తుతం ఇన్‌–సర్వీస్‌లో కొనసాగుతున్న ఉపాధ్యాయులందరికీ నిబంధన నుండి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలని పట్టుబట్టారు. ఉపాధ్యాయులకు కేవలం బోధన మినహా ఇతర ప్రభుత్వ యాప్స్‌, బోధనేతర పనులు అప్పగించవద్దని, ప్రతి ఉన్నత పాఠశాలలో నాన్‌–టీచింగ్‌ స్టాఫ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్ల నియామకం చేపట్టాలని కోరారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వెయ్యికి పైబడిన కారుణ్య నియామకాలను వెంటనే భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ లోకల్‌ కేడర్‌గా పరిగణిస్తూ గెజిటెడ్‌ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో పూర్తిస్థాయి ఉపాధ్యాయులను నియమించాలని, వాటిని ఇంటర్‌ బోర్డుకు అప్పగించే కుట్రను విరమించుకోవాలన్నారు . ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి నిబంధనలు లేకుండా స్టడీ లీవ్‌ మంజూరు చేయాలని, పార్ట్‌ టైమ్‌ టీచర్ల రిటైర్మెంట్‌ వయస్సు 62 ఏళ్లకు పెంచి వారి సర్వీసును తక్షణమే రెగ్యులరైజ్‌ (క్రమబద్ధీకరణ) చేయాలని డిమాండ్‌ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యారంగ, ఆర్థికపరమైన సమస్యలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోందని, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయ సంఘాలతో అధికారిక చర్చలు జరపని పక్షంలో.. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, సమ్మెకు సైతం వెనకాడబోమని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు. టీచర్లు ధర్నా చేస్తుండటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతసేపటి తర్వాత టీచర్ల ధర్నా విరమించి జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నేతలు హేమలత, జాబీర్‌, పోకల మధుసూదన్‌, గఫార్‌ ఖాన్‌, కిరణ్‌ కుమార్‌, శివారెడ్డి, జగన్మోహన్‌ రెడ్డి వేణుగోపాల్‌ రెడ్డి, కడియాల మురళి, రాజారెడ్డి,జనార్దన్‌ రెడ్డి, మోహన్‌ కుమార్‌ రెడ్డి, అమర్నాథ్‌ రెడ్డి, సోమశేఖర్‌ రెడ్డి, కిషోర్‌ కుమార్‌ రెడ్డి, మోహన్‌ యాదవ్‌, సుధాకర్‌ నాయుడు, రవి ప్రకాష్‌, రమేష్‌, బాలాజీ, శ్రీనివాస్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, విజయ్‌, సుధాకర్‌ నాయుడు, హరిబాబు, నరసింహులు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

12వ వేతన సంఘం ఏర్పాటుకు డిమాండ్‌

మదనపల్లె మిషన్‌కాంపౌండ్‌లో బైఠాయింపు

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement