పుంగనూరు : పుంగనూరు నియోజకవర్గ అధికార పక్షంలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరి రక్తపాతానికి దారితీశాయి. నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్న ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లాబాబు) వర్గానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మంగళవారం రాత్రి గట్టి ‘షాక్’ ఇచ్చింది. పార్టీని వీధిపాలు చేశారంటూ చల్లాబాబుపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ, ఆయన ముఖ్య అనుచరులను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. మరోవైపు గ్రూపు రాజకీయాల నేపథ్యంలో సాగిన దాడులకు కారణమైన 12 మంది చల్లా అనుచరులపై పోలీసులు ఏకంగా ‘హత్యాయత్నం’ కేసులు నమోదు చేయడం నియోజకవర్గంలో కలకలం రేపింది.
మంత్రుల ముందే కుమ్ములాట..
దళిత నేతపై దాడి
పుంగనూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని మార్చాలని పట్టుబడుతూ ప్రముఖ వ్యాపారవేత్త మధుసూదన్‌నాయుడు, బోయకొండ మాజీ చైర్మన్ రమణారెడ్డి, కాపు సంఘ నాయకుడు సోమల సురేష్‌లు తిరుపతిలో రాష్ట్ర మంత్రుల సమక్షంలో తీవ్రస్థాయిలో పట్టుబట్టారు. తమ పదవి ఊడే ప్రమాదం పొంచివుందనే ఈ నిజాలను జీర్ణించుకోలేని చల్లా రామచంద్రారెడ్డి వర్గీయులు మంత్రుల ముందే రెచ్చిపోయారు. మధుసూదన్‌నాయుడు వర్గానికి చెందిన దళిత నాయకుడు ముల్లంగి రమణపై దారుణంగా హత్యాయత్నం చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘోర సంఘటనతో ఆగ్రహించిన అసమ్మతి వర్గం నాయకులు ఇన్‌ఛార్జ్‌ను మార్చేదాకా పోరాటం ఆపేది లేదని హెచ్చరిస్తూ మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడం, నాయకులు ఎవరూ మంత్రుల మాట వినే పరిస్థితి లేకపోవడంతో చేసేదేం లేక సమావేశాన్ని వాయిదా వేసి అక్కడి నుంచి మంత్రులు లాఘవంగా జారుకున్నారు.
ముల్లంగి రమణ ఫిర్యాదు..
12 మందిపై హత్యాయత్నం కేసులు
తిరుపతిలో దళితనాయకుడు ముల్లంగి రమణపై జరిగిన దారుణ హత్యాయత్నం ఘటనపై బాధితుడు ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు అత్యంత పదునైన సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎస్‌ఐ సుధాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్యుమరేషన్ గొడవల నేపథ్యంలో సాగిన ఈ ప్రాణాంతక దాడిపై ఎఫ్‌ఐఆర్ నంబరు: 222/226తో కొత్త చట్టం కింద హత్యాయత్నం కేసులు బనాయించారు. ఈ కేసులో ఒకటో నిందితుడిగా ఉయ్యాల రమణ, రెండో నిందితుడిగా నాగార్జుననాయుడు, మూడో నిందితుడిగా బండ్ల రమేష్, నాలుగో నిందితుడిగా హేమప్రకాష్‌రెడ్డిలతో పాటు గూడూరు హరి, అమరనాథరెడ్డి, మహమ్మద్ అక్రమ్, నీలం భాస్కర్, గురుస్వామి, చౌదరి, కార్తీక్, ప్రభాకర్ తదితర 12 మంది చల్లాబాబు ప్రధాన అనుచరులపై కేసులు నమోదు కావడం గమనార్హం.
చల్లా శకం ముగింపు..
నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే తెలుగుదేశం పార్టీ పూర్తిగా వీధిన పడిందని, చల్లాబాబే ఇందుకు కారణమని అధిష్టానం ఒక ముగింపునకు వచ్చింది. తిరుపతి వేదికగా సాగిన రక్తపాతంతో చల్లా రామచంద్రారెడ్డిని తక్షణమే మార్చేందుకు నారావారు సిద్ధమయ్యారు. పార్టీలో సాగుతున్న విచ్చలవిడి క్రమశిక్షణా రాహిత్యానికి శాశ్వతంగా చెక్ పెడుతూ.. వ్యాపారవేత్త మధుసూదన్‌నాయుడుకు పుంగనూరు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. పరిస్థితిని పర్యవేక్షించి రెండు వర్గాల నాయకులను విజయవాడ దర్బార్‌కు తీసుకురావాల్సిందిగా పీలేరు ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో.. పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవి నుండి చల్లా రామచంద్రారెడ్డిని శాశ్వతంగా తొలగించడానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ ఆకస్మిక రాజకీయ పరిణామాలతో చల్లాబాబు వర్గం తీవ్ర నిరాశలో మునిగిపోగా.. అసమ్మతి వర్గంలో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది.
పుంగనూరు ఇన్‌ఛార్జ్‌గా ‘మధుసూదన్‌నాయుడు’?
దళిత నేతపై చల్లా వర్గీయుల హత్యాయత్నం
ఉయ్యాల రమణ సహా 12 మందిపై కేసు నమోదు
మంత్రుల ముందే ముష్టియుద్ధాలు
సీఎం చంద్రబాబు ఆదేశాలతో నలుగురు ముఖ్యులపై సస్పెన్షన్
చంద్రబాబు సీరియస్.. నలుగురిపై సస్పెన్షన్ వేటు
పుంగనూరులో చెలరేగిన ఈ తీవ్ర అంతర్గత ఘర్షణలు, దళిత నేతపై దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆరా తీశారు. పార్టీ పరువు బజారున పడేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు.. దళిత నేతపై దాడికి కారణమైన చల్లాబాబు ముఖ్య అనుచరులు ఉయ్యాల రమణ, నూకల నాగార్జున, మహమ్మద్ అక్రమ్, చావడి షేక్ కరీముల్లాలు నలుగురిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.


