● దాడి కేసు నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు
● రొంపిచెర్ల క్రాస్ రోడ్డు వద్ద ఉయ్యాల రమణ పోలీసుల అదుపులోకి?
● జర్నలిస్టులపైనా ప్రతాపం.. రెండు వేర్వేరు క్రిమినల్ కేసులు నమోదు
రొంపిచెర్ల : తిరుపతి వేదికగా సాగిన దళిత నాయకుడిపై హత్యాయత్నం మరియు అరాచక ఘటనలపై తిరుపతి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ దాడి కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైన నిందితుల కోసం ఖాకీ బలగాలు శరవేగంగా గాలింపు చర్యలు చేపట్టాయి. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. సోమవారం రాత్రి రొంపిచెర్ల క్రాస్ రోడ్డు సమీపంలో ఈ కేసులో ఒకటో నిందితుడు (ఏ1), రాష్ట్ర కురబ సంఘం డైరెక్టర్ ఉయ్యాల రమణను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 11 మంది నిందితుల కోసం రొంపిచెర్ల మండలవ్యాప్తంగా పోలీసులు జల్లెడ పడుతున్నారు.
జర్నలిస్టులపై దాడి.. రెండు కేసులు నమోదు
తిరుపతి సమావేశంలో తెలుగుదేశం తమ్ముళ్ల అరాచకాలను, ముష్టియుద్ధాలను తమ వీడియో కెమెరాల్లో కవర్ చేస్తున్న పత్రిక, టీవీ జర్నలిస్టులపై కూడా చల్లా వర్గీయులు నిర్దాక్షిణ్యంగా ప్రతాపం చూపించారు. విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై దాడి చేసి, సమాచార హక్కును కాలరాసేందుకు యత్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పోలీసులు.. దళిత నేతపై హత్యాయత్నంతో పాటు, జర్నలిస్టులపై దాడి చేసినందుకు రెండు వేర్వేరు క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
తమ్ముళ్లలో భయాందోళన..
అంతా అండర్‌గ్రౌండ్
పోలీసులు నిందితుల వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతూ, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియకుండా రొంపిచెర్ల పరిసర ప్రాంతాలలో అర్ధరాత్రి వేళల్లో సైతం గాలింపులు జరుపుతుండటంతో నియోజకవర్గ తమ్ముళ్లలో వణుకు మొదలైంది. తిరుపతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరైన ద్వితీయ శ్రేణి నాయకులు, చల్లా ప్రధాన అనుచరులు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని సామూహికంగా అజ్ఞాతంలోకి (అండర్‌గ్రౌండ్) వెళ్లిపోయారు. ఎవరి ఇళ్లపై పోలీసులు ఎప్పుడు దాడి చేస్తారోననే తీవ్ర భయాందోళనలు ప్రస్తుతం పుంగనూరు తమ్ముళ్లలో నెలకొన్నాయి.


