● ఉపాధ్యాయుల నిరసనపై జేసీ విచారణకు ఆదేశం : వచ్చిన వారంతా లీవ్ పెట్టారని తేల్చిన డీఈవో
● విమర్శలు పక్కన పెట్టి ప్రభుత్వానికి నివేదిక పంపడం వరకే జేసీ బాధ్యతని ఉపాధ్యాయుల స్పష్టీకరణ
ఉపాధ్యాయ సమస్యలపై మంగళవారం మదనపల్లెలో ఫ్యాప్టో చేపట్టిన శాంతియుత నిరసనపై జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) శివ్ నారాయణ్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఉపాధ్యాయులను ఉద్దేశించి.. ‘పాఠశాలలు వదిలి ఇంతమంది ఎందుకు వచ్చారు, అందరూ సెలవు పెట్టారా లేదా?‘ అని ప్రశ్నిస్తూ, దీనిపై తక్షణ విచారణ జరపాలని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. జేసీ ఆదేశాలతో హుటాహుటిన కలెక్టరేట్‌కు చేరుకున్న డీఈఓతో ఫ్యాప్టో నేతలు మాట్లాడి తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తామిచ్చిన వినతిపత్రంలోని సమస్యల పరిష్కారం జేసీ పరిధిలో లేవని, దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం వరకే జేసీ బాధ్యతని నేతలు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో వినతిపత్రాలు ఇవ్వడం దశాబ్దాలుగా వస్తున్న అనవాయితీ అని, ఆందోళనలో పాల్గొన్న ఉపాధ్యాయులంతా నిబంధనల ప్రకారం అధికారికంగా లీవ్ పెట్టే వచ్చారని, సెలవు పెట్టి తమ హక్కుల కోసం పోరాడటం ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. దీనిపై డీఈఓ సుబ్రహ్మణ్యం స్పందిస్తూ.. జేసీ సూచనల మేరకు తాము ఉపాధ్యాయుల హాజరుపై తక్షణ క్షేత్రస్థాయి విచారణ చేపట్టామని, ఆందోళనలో పాల్గొన్న వారంతా రికార్డుల ప్రకారం ముందే సెలవు పెట్టారని విచారణలో స్పష్టంగా తేలిందని వెల్లడించారు. ఇదే నివేదికను తాను జేసీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఫ్యాప్టో నాయకులతో డీఈఓ స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది.


