పెద్దమండ్యం : మండ్యం హరిజనవాడ పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ఎండిన వేపచెట్లను ఎట్టకేలకు అధికారులు తొలగించారు. ఈ పాఠశాలలో 1 నుండి 5వ తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులు విరామ సమయంలో అక్కడే ఆడుకుంటుంటారు. ఎండిన చెట్లతో పొంచి ఉన్న ముప్పుపై ‘అప్రమత్తత కరువు’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. వారి ఆదేశాల మేరకు ఎంఈవో మనోహర, ఉపాధ్యాయుడు నాగమునిరెడ్డిలు యుద్ధప్రాతిపదికన జేసీబీని రప్పించి ఆ ఎండిన వేపచెట్లను పూర్తిగా తొలగించారు. ప్రమాదం పొంచి ఉన్న చెట్లను తొలగించి తమ పిల్లలకు రక్షణ కల్పించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ‘సాక్షి’కి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
దరఖాస్తు గడువు పెంపు
మదనపల్లె సిటీ : జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. ఈనెల 17వతేదీ వరకు ఆన్‌లైన్‌లోదరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. ఫైనల్ సబ్ మిషన్‌కు ఈనెల 20వతేదీ వరకు సమయం ఉందన్నారు. జిల్లాలోని అర్హుౖలైన ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఎంఈఓలు, హెచ్‌ఎంలు ప్రోత్సహించాలన్నారు. ప్రతి మండలం నుంచి కనీసం ఒక్కరైనా ఉపాధ్యాయులు నేషనల్ టీచర్ అవార్డులకు దరఖాస్తు చేసేలా ఎంఈవోలు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.


