పరిశీలించి చర్యలు తీసుకుంటాం
● గుట్ట వెనుక వైపునకు తరలింపు
● రాత్రి పూట కాల్చివేత
● సంపద కేంద్రాలు ఉన్నా.. లేనట్లే!
● కొరవడిన పర్యవేక్షణ
చౌడేపల్లెలో చెత్తసేకరణ కేంద్రానికి తరలించకుండా మరో చోటికి తరలించి చెత్తకు నిప్పు పెట్టిన దృశ్యం, బయట పడేసిన సూదులు, ఇంజెక్షన్‌లు
చౌడేపల్లె : ‘స్వచ్ఛాంధ్ర... స్వర్ణాంధ్ర నినాదంతో సంపద సృష్టిస్తాం, చెత్తసేకరణ కేంద్రాల ద్వారా గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయం తెప్పిస్తాం’ అని సీఎం చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఉత్తిత్తే అని తేట తెల్లమౌతోంది. చెత్తసేకరణ క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇంటింటా చెత్తసేకరణ సక్రమంగా జరగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరీ దారుణంగా తయారైంది. ఎక్కడా చెత్తసేకరణ కేంద్రాలను సక్ర మంగా వినియోగించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హరితరాయబారులు(గ్రీన్ అంబాసిడర్లు)తో కాలువలు శుభ్రపరచడం, ట్యాంకుల్లో క్లోరినేషన్ పను లు చేయించుకొని కాలం వెల్లదీస్తూ చెత్త సేకరణను గాలికి వదిలేశారని తెలుస్తోంది. మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉండగా ఆమినిగుంట, కొండయ్యగారిపల్లె గ్రామ పంచాయతీల్లో మినహా అన్ని చో ట్ల చెత్త సేకరణ కేంద్రాలు ఉండగా అలంకార ప్రా యంగా మారాయి. వీటిలో 54 మంది హరిత రాయబారులు పనులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చెత్తను తగలబెట్టేస్తున్నారు..
మండల కేంద్రంలోని చెడుగుట్లపల్లె మార్గంలో సుమారు రూ.15 లక్షల వ్యయంతో చెత్త సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చెత్త సేకరణ కోసం అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతో కార్మికులు చెత్తను పక్కనే గల గుట్ట వద్ద డంప్ చేస్తున్నారు. ఒక రోజుకు మూడు ట్రాక్టర్ల లోడ్ల చెత్తను సేకరించి అక్కడ పడేయడం జరుగుతోంది. చెత్త నుంచి ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు తదితర వస్తువులను సేకరించకుండా వాటికి రాత్రి పూట నిప్పుపెట్టి కాల్చేస్తున్నారు. ఇలా తగలబెట్టడంతో సంపద కాలిపోగా పొగ కారణంగా వాతావరణం కాలుష్యం అవుతోంది. అలాగే వాడి పడేసిన సూదులు, ఇంజెక్షన్‌లు, ట్యాబ్‌లెట్స్ తదితర ఆసుపత్రుల్లోని వ్యర్థాలను పొలాల్లోనే పడేస్తున్నారు.
బండపైనే కోళ్ల వ్యర్థాలు
చుట్టూ పంట పొలాలు, గుట్టకు పక్కనే ఉన్న ఓ బండపై కోళ్ల వ్యర్థాలు పడేస్తుండడంతో ముక్కులు మూ సుకొని వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో వెలువడే చికెన్‌షాపుల వద్ద నుంచి వచ్చే కోళ్ల వ్యర్థాలను ఆరుబయట పడేస్తుండడంతో కుక్కలకు నిలయాలుగా మారాయి. అటు వైపు వెళ్తే ప్రజలు, జంతువులపై దాడులకు తెగబడుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
చెత్తసేకరణ కేంద్రానికి చెత్తను తరలించేలా చర్యలు తీసుకొంటాం. వ్యర్థాలను, వాడిపడేసిన సూదులు, ఇతర వస్తువులు ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చూస్తాం. చెత్తకు నిప్పు పెట్టకుండా సంపద తయారు చేయడానికి సిబ్బందితో కలిసి కృషి చేస్తాం.
– శివయ్య, పీడీఓ, చౌడేపల్లె


