అదిగో బభ్రువు... ఇదిగో భల్లూకం! | - | Sakshi
Sakshi News home page

అదిగో బభ్రువు... ఇదిగో భల్లూకం!

Jul 15 2026 1:10 AM | Updated on Jul 15 2026 1:10 AM

దూరం నుంచి చూస్తే గుండె ఝల్లుమంటుంది.. పొదల చాటు నుంచి అచ్చం నిజమైన ఎలుగుబంటి నోరు తెరిచి గర్జిస్తున్నట్లు కనిపిస్తుంది! పక్కనే మరో పొదల్లోంచి క్రూరమైన చిరుతపులులు ఎప్పుడు మీదికి దూకుతాయో తెలియని వణుకు పుడుతుంది. కానీ, కాస్త ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి నిశితంగా గమనిస్తే తప్ప తెలియదు.. అవి సజీవంగా కనిపించే జీవం లేని అద్భుతాలని!అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రసిద్ధ శీతల పర్యాటక క్షేత్రం హార్సిలీహిల్స్‌ పై ఉన్న అటవీశాఖ ప్రకృతి అధ్యయన కేంద్రంలోని వింతలు ఇవి. 1991లో ప్రారంభమైన ఈ కేంద్రం, మూడు దశాబ్దాలు దాటినా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతూనే ఉంది. ఇక్కడి అటవీశాఖ మ్యూజియంలో అడవికి సంబంధించిన ఎన్నో అరుదైన వస్తువులను సేకరించి ప్రదర్శనకు ఉంచారు. అన్నింటికంటే పర్యాటకులను ఆకర్షించేది మాత్రం ఇక్కడి జంతువుల చర్మాలతో అచ్చం నిజమైన రూపాలు ఇచ్చిన కృత్రిమ జంతు ప్రదర్శనలే. అడవిలో చనిపోయిన ఒక ఎలుగుబంటి చర్మాన్ని పక్కాగా సేకరించి, దానికి అచ్చం నిజమైన ఎలుగుబంటిలాంటి రూపాన్ని ఇచ్చారు. అది పొదల్లో దూరి చెట్టుపై ఉన్న తేనెపట్టు కోసం పైకి లేచినట్లుగా అమర్చిన తీరు అద్భుతం. దీని పక్కనే రెండు చిరుత పులుల చర్మాలతో వాటికి కూడా సజీవ రూపాలు ఇచ్చారు. అందులో ఒక చిరుత పొదల మాటున వేట కోసం పొంచి ఉన్నట్లు, మరొకటి బయట నిలబడినట్లు కళ్లకు కట్టినట్లు ఏర్పాటు చేశారు. వీకెండ్‌లలో వచ్చే చిన్నపిల్లలు ఇవి అచ్చం నిజమైన జంతువులేనని భావించి, వాటి వద్దకు వెళ్లేందుకు వణుకుతూ, జంకుతారు. పెద్దలు అవి బొమ్మలేనని నమ్మబలికిన తర్వాతే చిన్నారులు వాటి పక్కన నిలబడి ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపిస్తారు. – సాక్షి, మదనపల్లె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement