రొంపిచెర్ల : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు అయ్యాయి. రొంపిచెర్ల మండలంలో మంగళవారం బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ ఫజులుపేటకు చెందిన లైన్‌మ్యాన్ రెడ్డెప్ప(60), మోహన్‌రెడ్డి (38) ద్విచక్ర వాహనంలో రొంపిచెర్ల నుంచి చిచ్చిలివారిపల్లెకు వెళ్తుండగా లంకిపల్లెవారిపల్లె సమీపంలో రొంపిచెర్ల వైపు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వారిద్దరూ గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం 108లో పీలేరు ఆస్పత్రికి తరలించారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనం ఢీకొని..
మదనపల్లె టౌన్ : కురబలకోట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డారు. ముదివేడు పోలీసుల కథనం ప్రకారం.. మదనపల్లె పట్టణం గాంధీపురానికి చెందిన రైతు వెంకటరమణ(60) బి.కొత్తకోట మండలం మొగసాల మర్రి వద్ద కొంత భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. సోమవారం కూడా ఎప్పటిలాగే పొలం పనులు ముగించుకొని అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గంమధ్యలో కురబలకోట మండలం అంగళ్లు బైపాస్ రోడ్డు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఆయన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని 108 అంబులెన్స్‌లో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటరమణ కోలుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు.
రన్నింగ్ చేస్తూ వెళ్తుండగా..
చౌడేపల్లె : ఎలాగైనా సరే ఈ సారైనా రక్షణ శాఖలో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో తెల్లారక ముందే ఫిజికల్ ఫిట్‌నెస్‌లో భాగంగా రన్నింగ్ చేస్తూ వెళ్తున్న యువకుడిని గుర్తు తెలియనివాహనం ఢీకొన్న ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుదిపట్ల పంచాయతీ మిట్టూరుకు చెందిన నాగరాజ కుమారుడు పవన్‌కుమార్(23) డిగ్రీ వరకు చదివాడు. ఇటీవల రక్షణ శాఖలో పలు ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. ఆర్మీ సెలెక్షన్‌కు వెళ్లాలనే ఆశయంతో మిట్టూరు నుంచి ప్రతి రోజూ చౌడేపల్లె మార్గం వైపు రన్నింగ్ చేస్తూ బిల్లేరు వద్దకు వచ్చేవాడు. ఈ క్రమంలో రోజూ వారీగా బిల్లేరు నుంచి తిరిగి రన్నింగ్ చేస్తూ వెళ్తున్న పవన్‌కుమార్‌ను వెనుక వైపు నుంచి ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. లేవలేని ిస్థితిలో పడి ఉన్న అతన్ని గమనించిన స్థానికులు 108 సహాయంతో పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవల కోసం తిరుపతికి తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతున్న వెంకటరమణ
గాయపడిన రెడ్డెప్ప


