● ప్రమాదమా.. హత్యా..?
● మోసగాళ్లపై కేసు పెట్టిన
గంటల వ్యవధిలో మృతి
● గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి
వెళ్లిపోయిన వైనం
● ఈ ఘటనలో ఏమైనా కుట్ర ఉందా?
పుంగనూరు : ఇల్లు కట్టుకోవాలనుకుని స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలాన్ని ఇతరులకు కూడా అమ్మి మోసగించారని గుర్తించాడు. వెంటనే మదనపల్లె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించి, డ్యూటీ కోసం చిత్తూరులోని బేవరేజస్ స్టోర్‌కు బయలుదేరిన దేవేంద్ర మార్గమధ్యంలో ఎలా చనిపోయాడు.. ఇది ప్రమాదమా.. లేదా హత్యానా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోసగాళ్లపై కేసు పెట్టిన దేవేంద్ర గంటల వ్యవధిలో మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పుంగనూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే దేవేంద్ర అనే ఎకై ్సజ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మదనపల్లెలో నివాసం ఉన్న ఎకై ్సజ్ కానిస్టేబుల్ దేవేంద్ర(32) మదనపల్లె సమీపంలో ఇంటి స్థలాన్ని 2023లో కొనుగోలు చేశాడు. ఆ స్థలం ఇతరులకు కూడా విక్రయించి, తనను మోసం చేశారని దేవేంద్ర తాలూకా పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తరిగొండ శ్రీనివాసులురెడ్డి, నారాయణరెడ్డి, సుధాకర్‌లపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ తతంగం రాత్రి 11 గంటల వరకు జరిగింది. పోలీసుల వద్ద ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకుని అక్కడి నుంచి చిత్తూరు డ్యూటీకి బయలుదేరాడు. మార్గమధ్యంలో పుంగనూరు టోల్‌గేట్ వద్ద సుమారు 11:45 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ అన్సర్‌బాషా సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతుడి భార్య భూమి కేసుకు సంబంధించిన వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. కాగా గంటల వ్యవధిలో ఎకై ్సజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతి పలు అనుమానాలకు దారి తీస్తోంది. వాహనం ఢీకొని వెళ్లిపోవడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా..? దేవేంద్ర ఏమైనా హత్యకు గురైయ్యాడా...? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.


