మదనపల్లె టౌన్ : అప్పుల బాధ తాళలేక ఓ చేనేత కార్మికుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మదనపల్లె మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. చిన్నమండ్యం మండలం చిన్న నర్సుపల్లికి చెందిన గాడిదల రెడ్డి రాజేంద్రప్రసాద్ (50) మదనపల్లె మండలం సీటీఎం రైల్వే గేటు వద్ద నివాసం ఉంటున్న రాజేశ్వరిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అత్తగారింటికి వచ్చేసి కూలి మగ్గాలు నేస్తూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. ఏడాది క్రితం కూతురు రిషిత వివాహం ఘనంగా చేశారు. ఆ పెళ్లికి దాదాపు రూ.10 లక్షల వరకు అప్పు చేశారు. అప్పు తీర్చడం తనకు తలకు మించిన భారంగా మారింది. వడ్డీ వ్యాపారులు, రుణదాతలు రోజూ బాకీ చెల్లించాలని ఒత్తిడి చేయడంతో అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ‘బతికినంత కాలం మగ్గాలు నేసినా కూతురి పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేను. నేను చనిపోతే ఆ అప్పుల బాధ అయినా తీరుతుంది’ అని భావించాడో ఏమో నేతన్న... జీవితం గురించి ఏ మత్రం ఆలోచించకుండా తనవు చాలించాడు.
వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి..
భార్యకు, ఆరో తరగతి చదువుతున్న కుమారుడికి తెలియకుండా వారం క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. సీటీఎం క్రాస్ రోడ్డు సమీపంలోని నేతాజీ కాలనీ వెనుక ఉన్న చెట్ల పొదల్లో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కళా వెంకటరమణ ఆదేశాలతో ఎస్సై చంద్రమోహన్ సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ వార్త విన్న భార్య రాజేశ్వరి భర్త మృతదేహం వద్దకు చేరుకొని గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అందరినీ కలచివేసింది. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


