మదనపల్లె టౌన్ : ‘మదనపల్లె అభివృద్ధికి ప్రస్తుతం అత్యంత అవసరమైంది అంతర్జాతీయ విమానాశ్రయం’ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ చింతా మోహన్ అన్నారు. మంగళవారం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పానికి విమానాశ్రయం తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లు, మదనపల్లెకు కూడా విమానాశ్రయం తీసుకొస్తే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మదనపల్లెకు తప్పకుండా ఎయిర్‌పోర్టు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రి సందర్శనపై స్పందిస్తూ, ‘ఇక్కడ వైద్య సేవలు ఫర్వాలేదు. కానీ ఈఎన్టీతోపాటు ఇతర స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంది. వెంటనే నియామకాలు చేపట్టి రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. రాజకీయ పార్టీల అడ్డంకుల వల్లే ఆసుపత్రి అభివృద్ధికి నోచుకోలేదు’ అని ఆరోపించారు. ‘సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాకపోయినా కనీసం మంచి మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి స్థాయికి అభివృద్ధి చేయాలి, ప్రస్తుతం క్యాజువాలిటీలో మెడికల్ ఆఫీసర్లు లేకపోవడంతో చిన్న కేసులను కూడా రెఫర్ చేస్తున్నారు. రోగులు చనిపోతారనే భయంతో సేఫ్ సైడ్ కోసం వాళ్లు రెఫరల్స్ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. గతంలో ఒక విదేశీ మహిళ మందులు లేని రోజుల్లోనే ఇక్కడ శానిటోరియం ఆసుపత్రి నెలకొల్పి మెరుగైన వైద్యం అందించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్, డా.యమల సుదర్శనం, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్


