● రెండేళ్లుగా అందని రుణాలు
● ‘అన్నదాత సుఖీభవ’ అంతఃర్థానం
● నాడు వడ్డీ లేని రుణాలు..
నేడు వడ్డీల మీద చక్రవడ్డీలు
● రూ.70 వేల రుణానికి
రూ.26 వేల వడ్డీ వసూలు
● సింగిల్ విండోల నోటీసుల కలకలం
● ఖరీఫ్ సాగు ప్రారంభమైనా
‘ససేమిరా’ అంటున్న బ్యాంకర్లు
● కార్డులపై తగ్గిన రైతుల ఆసక్తి
గుర్రంకొండ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెండేళ్లకు పైగా పంటల సాగు కోసం కౌలురైతులకు నయాపైసా రుణం కూడా మంజూరు కాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం కూడా రెండేళ్లు దాటినా వీరికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
పాత రుణాలకు బలవంతపు వడ్డీ వసూలు
గతంలో 2014–2017 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం జిల్లాలో కేవలం 452 మంది కౌలురైతులకు సింగిల్ విండోల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చింది. అయితే, గత రెండేళ్లుగా పాత వడ్డీలు, వాటిపై చక్రవడ్డీలు, బారు వడ్డీలను కలిపి కౌలురైతులకు నోటీసులు జారీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. రూ.లక్ష వరకు రుణం తీసుకున్న రైతులకు ఏకంగా రూ.40 వేల వడ్డీతో కలిపి అసలు, వడ్డీలు తక్షణమే కట్టాలని ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో కౌలురైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
నాడు వైఎస్సార్‌సీపీ ‘అండ’..
నేడు కూటమి ‘మొండిచేయి’
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది ‘వెఎస్సార్ రైతుభరోసా’ కింద కౌలురైతులకు ఒకేసారి రూ.7,500 పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకున్నారు. నేరుగా కౌలురైతుల బ్యాంకు ఖాతాలకే పంట నష్టపరిహారాన్ని జమ చేయడంతో పాటు, రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించి సాగుకు చేయూతనిచ్చారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పంట రుణాలు రాక.. సబ్సిడీ ఎరువులు, విత్తనాలు కూడా దక్కకపోవడంతో కౌలురైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ససేమిరా అంటున్న బ్యాంకర్లు..
కార్డులపై తగ్గిన ఆసక్తి!
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమై కౌలురైతులు పొలాలు దుక్కులు చేసుకుంటున్నా జిల్లాలో ఇంతవరకు ఒక్కరికి కూడా కొత్త రుణం అందలేదు. వ్యవసాయాధికారులు జారీ చేసిన సాగు వివరాల పత్రాలున్నా, ‘కేవలం సాగుచేసే పంటను ఆధారంగా చేసుకొని రుణాలు ఇవ్వలేం’ అంటూ బ్యాంకర్లు కరాఖండిగా తిరస్కరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి సాయం అందకపోవడంతో కౌలురైతులు ఇప్పుడు గుర్తింపు కార్డులు తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుత ఏడాది జిల్లా వ్యాప్తంగా కేవలం 6 వేల మందికి మాత్రమే అధికారులు అరకొరగా గుర్తింపు సర్టిఫికెట్లను జారీ చేశారు. గత రెండేళ్ల కూటమి ప్రభుత్వ మొత్తం పాలనలో కేవలం 15 వేల మంది కౌలురైతులకు మాత్రమే ఈ కార్డులు లభించాయి. అదే గత 2019–2024 వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో జిల్లా వ్యాప్తంగా ఏకంగా 64,527 మందికి పైగా కౌలురైతులకు కార్డులు ఇచ్చి, రుణాలు ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి.
ప్రైవేట్ వడ్డీ వ్యాపారులే గతి
ఓవైపు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో, గత్యంతరం లేక రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. పంట పండినా పండకపోయినా, పొలం కౌలుకు ఇచ్చిన యజమానికి మాత్రం ఒప్పందం ప్రకారం కౌలు డబ్బులు తప్పనిసరిగా చెల్లించాల్సిందే. దీంతో సాగును నమ్ముకుని గత కొన్నేళ్లుగా కేవలం నష్టాలనే చవిచూస్తూ అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి, బలవంతపు వడ్డీ వసూళ్ల నోటీసులను తక్షణమే నిలిపివేయాలని, కౌలురైతులందరికీ తక్షణమే ఖరీఫ్ పంట రుణాలు ‘అన్నదాత సుఖీభవ’ సాయాన్ని విడుదల చేయాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
రమేశ్‌బాబు
వెంకటరమణారెడ్డి
రెడ్డిమోహన్
గుర్రంకొండకు చెందిన కౌలురైతు రెడ్డిమోహన్ మాట్లాడుతూ.. 2016లో వడ్డీ లేని రుణాలంటూ సింగిల్ విండో ద్వారా రూ.70 వేలు తీసుకుంటే, ఇప్పుడు ఒక్కసారిగా అన్ని సంవత్సరాల వడ్డీ కలిపి రూ.26 వేలు బలవంతంగా కట్టించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, దిగువ బురుజుపల్లెకు చెందిన కౌలురైతు వెంకటరమణారెడ్డి మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తే వైరస్, నల్లమచ్చల వల్ల పంట దెబ్బతిని కిలో రూపాయికి కూడా ఎవరూ కొనకపోవడంతో పెట్టుబడి సైతం రాలేదని, పంట నష్టపోయినా ప్రభుత్వం నుండి రూపాయి పరిహారం అందలేదని వాపోయారు. జిల్లా కౌలురైతుల సంఘం కార్యదర్శి (టి.రాజంపల్లె) రమేశ్‌బాబు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా జిల్లాలో కౌలురైతులకు ‘అన్నదాత సుఖీభవ’ సాయం దక్కలేదని, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇవ్వకపోగా బ్యాంకర్లు కూడా కౌలురైతులను బ్యాంకుల వైపు రానివ్వడం లేదని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


