మనోహర విహారం | - | Sakshi
Sakshi News home page

మనోహర విహారం

Jul 13 2026 1:28 AM | Updated on Jul 13 2026 1:28 AM

● మల్లయ్య వాహనం.. మనోహర విహారం

● మల్లయ్య వాహనం..

హిమాన్విత శైవక్షేత్రమైన మల్లయ్యకొండ ప్రకృతి ఒడిలో ఎన్నో మూలికలు, అటవీ సంపదతో పాటు వన్యప్రాణులకు నిలయంగా విరాజిల్లుతోంది. అలాంటి పవిత్ర కొండల అటవీ సముదాయం నుండి వచ్చిన ఒక అందమైన జాతీయ పక్షి నెమలి, తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని ఇట్నేనివారిపల్లె వద్ద గల హౌసింగ్‌ కాలనీలో ప్రత్యక్షమై అందరినీ కనువిందు చేసింది. సాధారణంగా దట్టమైన అడవుల్లో, పచ్చని లోయల్లో తిరిగే నెమళ్లు.. వాతావరణ మార్పుల వల్ల అటవీ ప్రాంతంలో ఆహారం, తాగునీరు లభించని తరుణంలో సమీపంలోని పంటపొలాలు, జనవాసాల్లోకి వస్తుంటాయని కాలనీవాసులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కొండ దిగి వచ్చిన ఓ నెమలి హౌసింగ్‌ కాలనీలోని నూతన ఇళ్ల పైకప్పు ప్రహరీలపైకి చేరి గంభీరంగా నిలబడింది. కొండపై వెలసిన మల్లికార్జున స్వామి వారి వాహనమే స్వయంగా తమ ఇళ్ల వద్దకు వచ్చిందా అన్నట్లుగా కాలనీవాసులు ఆ దృశ్యాన్ని భక్తిభావంతో తిలకించారు. కాసేపు సందడి చేసిన అనంతరం ఆ నెమలి ఎవరికీ దొరకకుండా తిరిగి సురక్షితంగా మల్లయ్యకొండ అడవుల్లోకి ఎగిరిపోవడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. – తంబళ్లపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement