కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులతో చెరువులను పునరుద్ధరిస్తుంటే.. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో మాత్రం అధికారుల కళ్లముందే చెరువులను పూడ్చివేస్తూ అక్రమంగా కబ్జాలు చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయకట్టు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ.40 లక్షల నిధులు వృథా
రొంపిచెర్ల మండల పరిధిలోని బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ పెద్ద చెరువు కట్టను ఇటీవలే సుమారు రూ. 40 లక్షల ఇరిగేషన్ నిధులతో బలోపేతం చేశారు. ఇందులో భాగంగా చెరువులో దట్టంగా పెరిగిన ముళ్ల కంపలను సైతం తొలగించి సాగునీటి నిల్వకు అనుకూలంగా మార్చారు.
మట్టి తోలి.. రోడ్డు పక్కన ప్లాట్లు
ఇంతవరకు బాగానే ఉన్నా.. కొందరు అక్రమార్కులు వినాయక నగర్ నుంచి పెద్ద చెరువు కట్ట వరకు ఉన్న రోడ్డు పక్కన చెరువు గర్భాన్ని అడ్డగోలుగా పూడ్చివేస్తున్నారు. రాత్రివేళల్లో లారీల ద్వారా మట్టిని తోలి, ఆ స్థలాన్ని చదును చేసి ఇళ్లను నిర్మించుకుంటున్నారు.
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం
ఈ అక్రమ ఆక్రమణల తంతు గత కొన్ని సంవత్సరాలుగా బహిరంగంగా సాగుతున్నా.. స్థానిక రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్ప టికై నా ఉన్నతాధికారులు స్పందించి, పెద్ద చెరు వు గర్భాన్ని పూడ్చకుండా కాపాడాలని సాగునీటి ఆయకట్టు రైతాంగం డిమాండ్ చేస్తోంది. – రొంపిచెర్ల


