నిండుగా విసిరిన కల్లాలు.. రాశులుగా పోసిన కనకధాన్యాలు.. ఉమ్మడి కుటుంబాల కోలాహలం.. ఒకప్పుడు రాయలసీమ పల్లెసీమల జీవన సంస్కృతికి ఇవే సజీవ సాక్ష్యాలు. ఆ సంపదకు, పల్లె లక్ష్మికి నిలయాలుగా నిలిచిన ‘ధాన్యపు గెరిశెలు’ (రాతి కోటార్లు) ప్రస్తుతం ప్రాభవం కోల్పోయి, కాల గర్భంలో కలిసిపోతూ కేవలం నాటి జ్ఞాపకాల చిహ్నాలుగా దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ బస్తాల వాడకం అమలులోకి వచ్చాక వీటి వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. ఒక్కో పెద్ద గెరిశెలో సుమారు 100 బస్తాల ధాన్యాన్ని ఎలాంటి పురుగు పట్టకుండా దశాబ్దాల పాటు భద్రపరిచేవారు. అవసరమైనప్పుడు కింది భాగంలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా కావలసినంత ధాన్యాన్ని తీసుకునేవారు. నాటి సిరిసంపదలకు నిలువెత్తు రూపాలుగా నిలిచిన ఇవి, నేడు నిరుపయోగంగా మారి దిష్టిబొమ్మల్లా మిగిలిపోవడంపై పాతతరం వారు గతాన్ని నెమరువేసుకుంటున్నారు. – గుర్రంకొండ


