చిట్టి వెన్నుపై కొండంత బరువు | - | Sakshi
Sakshi News home page

చిట్టి వెన్నుపై కొండంత బరువు

Jul 13 2026 1:28 AM | Updated on Jul 13 2026 1:28 AM

విద్యార్థులపై మోయలేని భారం

అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం

నిబంధనలకు తూట్లు

పట్టించుకోని విద్యాశాఖాధికారులు

మదనపల్లె సిటీ : ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన బాల్యంలో చిన్నారులు వయసుకు మించి భారం మోస్తున్నారు. ఫ్రీకేజీ, ఎల్‌కేజీల్లోనే బ్యాగు నిండా బండెడు పుస్తకాలతో వెన్ను దెబ్బతింటోంది. ఈ సంచులతో రెండు, మూడు అంతస్తుల భవంతులు ఎక్కేదెలా, దిగేదెలా అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1,796 పాఠశాలలు ఉండగా 1,93,990 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలు 467 ఉండగా 90 వేల మంది విద్యార్థులున్నారు. జాతీయ విద్యాప్రణాళిక–2005, స్కూలు బ్యాగ్‌–2020 విధానంలో పుస్తకాల సంచిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెలా మూడో శనివారం పుస్తకాల సంచి లేని రోజు (నో బ్యాగ్‌ డే) అమలు చేయాలని పేర్కొన్నారు. ఎక్కడా దీనిని అమలు చేసిన దాఖలాలు లేవు. దీనిపై విద్యాశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు దాదాపు రెండు, మూడు అంతస్తుల భవంతులే. వీటిపైకి 5 నుంచి 10 కిలోల పుస్తకాల సంచితో విద్యార్థులు మెట్లు ఎక్కడం వల్ల.. పలు మానసిక, శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

మూడేళ్లకే బడికి పంపించేస్తున్నారు

అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే ఆరేళ్లు నిండే వరకు చూస్తారు. మన దగ్గర మాత్రం మూడేళ్లకే పుస్తకాల సంచిని భుజానికి ఇచ్చి పంపిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో అవసరం లేకున్నా పిల్లలకు వివిధ రకాల పబ్లికేషన్స్‌ పుస్తకాలు అంటగడుతున్నారు. దీంతో చిన్నారులు బరువు పుస్తకాల సంచితో అవస్థలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement