ఇరు వర్గాల పరస్పర దాడులు | - | Sakshi
Sakshi News home page

ఇరు వర్గాల పరస్పర దాడులు

Jul 13 2026 1:28 AM | Updated on Jul 13 2026 1:28 AM

మదనపల్లె టౌన్‌ : మొలకలచెరువు మండలం దేవలచెరువులో శనివారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసు కోవడంతో నలుగురు గాయపడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవలచెరువుకు చెందిన నాగరాజు, సుజాత దంపతులు, వారి కుమారుడు యోగేష్‌పై అదే ఊరికి చెందిన శివకుమార్‌ వర్గీయులు దాడి చేసి గాయపరిచారు. ఎదురు దాడిలో శివకుమార్‌ సైతం గాయపడ్డాడు. గాయపడిన బాధితులను కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

బీజేపీ సభ్యుడిపై

బీరు బాటిళ్లతో దాడి

మదనపల్లె టౌన్‌ : మదనపల్లెలో బీజేపీ క్రియాశీలక సభ్యుడిపై బీరు బాటిళ్లతో ప్రత్యర్థులు దాడి చేసిన సంఘటన ఆదివారం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. పట్టణంలో నివాసం ఉంటున్న కోసూరి భవానీ ప్రసాద్‌ (48) బీజేపీలో క్రియాశీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ సంఘానికి చెందిన పోస్టులను సోషల్‌ మీడియాలో కావాలనే అప్లోడ్‌ చేస్తున్నాడని అనుమానించి, స్థానిక నీరుగట్టువారిపల్లెలోని మార్కెట్‌ యార్డు సమీపంలో ఓ హోటల్‌ దగ్గర ఉన్న అతనిపై బీరు బాటిళ్లతో దాడి చేసి గాయపరిచారు. స్థానికు లు గమనించి బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

ఆటో లాక్కెళ్లారని డ్రైవర్‌ ఆత్మహత్య

మదనపల్లె టౌన్‌ : బాడుగ చెల్లించలేదని ఆటో యజమానులు ఆటోను లాక్కెళ్లడంతో మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సీటీఎం రోడ్‌ బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్న రెడ్డప్ప కుమారుడు హరి(30) బాడుగ ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల తన తండ్రి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తండ్రికి సపర్యలు చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న హరి, కొన్ని రోజులుగా ఆటో బాడుగ చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆటో యజమానులు వచ్చి ఆటోను తీసుకెళ్లిపోయారు. జీవనాధారమైన ఆటో లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన హరి ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హరి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement