మదనపల్లె టౌన్ : జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 9 మందికి గాయాలు అయ్యాయి. కురబలకోట మండలంలో ఆదివారం ఉదయం కారు, ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్ సహా మరో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. నందిరెడ్డిగారిపల్లికి చెందిన షామీర్ (55) ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహబున్నిషా(38)తోపాటు మరో ఇద్దరు ములకలచెరువులోని బంధువుల ఇంట్లో జరిగే పండుగకు హాజరయ్యేందుకు షామీర్ ఆటోలో బయలుదేరారు. ఆటో మార్గంమధ్యలోని కంటేవారిపల్లెకు చేరుకుంది. ఈ ఆటో, ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ షామీర్, ప్రయాణికులు మహబున్నిషాతోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు.
ట్రాక్టర్ ఢీకొని..
బంధువుల ఇంట్లో జరిగే పండుగకు బైక్‌పై వెళ్తున్న రైతును ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం ఉదయం గుర్రంకొండ మండలంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నంబుల పూలకుంట మండలం టి.ఎన్. పల్లెకు చెందిన రైతు వెంకటరమణ ఆచారి (60) నిమ్మనపల్లెలోని బంధువుల ఇంటికి పండుగ నిమిత్తం బైక్‌పై బయలు దేరాడు. మార్గమధ్యంలో గుర్రంకొండ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ ఆచారి కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారును ఢీకొన్న టెంపో
చౌడేపల్లె : మండల పరిధి సోమల నుంచి చౌడేపల్లె వైపు వస్తున్న కారును అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టెంపో ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే పక్షిరాజపురం వద్ద ఎదురెదురుగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవ్వగా.. రెండు ప్రమాదాల్లో రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని ప్రైవేటు వాహనం ద్వారా ఆసుపత్రులకు తరలించారు. కాగా గాయపడిన వారి వివరాలు తెలియరాలేదు.


