● కత్తులతో పరస్పరం దాడి చేసుకున్న వైనం
● పాత కక్షల నేపథ్యంలో ఘటన
మదనపల్లె టౌన్ : మదనపల్లె రామారావు కాలనీలో ఆదివారం ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఘర్షణకు దిగి కత్తులతో పరస్పరం పొడుచుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఒక కళాశాలలో డిగ్రీ చదువుతున్న స్థానిక రామారావు కాలనీకి చెందిన మోహిత్ నాక్(21), స్థానిక అనపగుట్టలో ఉండే షాజహాన్(21) మధ్య గతంలో చిన్నచిన్న గొడవలు జరిగి పాత కక్షలు పెంచుకున్నారు. ‘నన్ను చూశావు’ అనే విషయంపై ఇటీవల మళ్లీ వివాదం మొదలైంది. ‘నీ అంతు చూస్తా’ అంటూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇరువురు రామారావు కాలనీలో ఒకచోట చేరి వాగ్వాదానికి దిగారు. మాటకుమాట పెరిగి పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఇద్దరూ తమ వెంట తెచ్చుకున్న కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని గాయపడ్డారు. గాంజా మత్తులోనే గొడవ పడ్డట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. గాయపడిన విద్యార్థులను స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.


