● బోయకొండలో పోటెత్తిన రద్దీ
● ఒక్క రోజే 25 వేల మంది భక్తులు దర్శనం
చౌడేపల్లె : అమ్మా.. గంగమ్మ తల్లీ.. మమ్మల్ని కరుణించి ఆశీర్వదించమ్మా.. అంటూ భక్తులు బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించడానికి తరలివచ్చారు. వరుసగా సెలవులు రావడంతో బోయకొండ గంగమ్మ ఆలయానికి ఊహించని రీతిలో ఆదివారం భక్తుల రద్దీతో ఆలయం, పరిసర ప్రాంతాలు పోటెత్తాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 25 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అమ్మవారి దర్శనం రోజుల్లో ఆదివారం అత్యంత ప్రీతికరమైన దినం కావడంతో కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి జంతుబలులు సమర్పించి ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు చెల్లించారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. ప్రధాన గర్భాలయం నుంచి ఆలయం బయట గల గాలిగోపురం వరకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దీనికారణంగా వయసు పైబడినవారు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు. తాగునీటి కోసం ఇక్కట్లు పడ్డారు. అమ్మవారి దర్శనం అనంతరం ఈఓ పర్యవేక్షణలో అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
టికెట్ల ద్వారా రూ.14.50 లక్షల ఆదాయం
బోయకొండ దేవస్థానం వద్ద ఆదివారం ఒక్కరోజు మాత్రమే విక్రయించిన వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.14.50 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు.


