మదనపల్లె టౌన్ : మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ ఆదివారం పెంచుపాడు పంచాయతీలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. బొంగువారిపల్లి, పనసమాను కుంట, గొల్లపల్లి, కట్టుబావి తదితర గ్రామాలను సందర్శించిన సీఐ.. గ్రామసభలు నిర్వహించి రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళల భద్రత, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటం, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు. ప్రజలకు ఏవైనా సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కు గానీ, తన ఫోన్ నంబర్‌కు గానీ సమాచారం ఇవ్వాలన్నారు. దళారులు, బ్రోకర్లను ఆశ్రయించి మోసపోవద్దని, మీ సమస్యలపై తాము వెంటనే స్పందిస్తామని హామీ ఇచ్చారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే నిర్భయంగా తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత, సైబర్ నేరాలు,
మహిళల రక్షణపై అవగాహన


