చర్యలు తీసుకుంటాం
గుర్రంకొండ : గుర్రంకొండలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయంలో వెళ్లే దారిలో జాతీయ రహదారి 340 పక్కనే మళ్లీ కోళ్ల వ్యర్థాలను పడేస్తున్నారు. ఇక్కడ పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను ధ్వంసం చేసి కనిపించకుండా చేశారు. దీంతో పాదచారులు, భక్తులు దుర్గంధం భరించలేక ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
రెండు నెలల క్రితం ఈ పరిసరాల్లో కంపు కొడుతున్న కోళ్ల వ్యర్థాలతో పాదచారులు, గుడికెళ్లే భక్తులు దుర్గంధం భరించలేక నానా ఇబ్బందులు పడ్డారు. సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలతో అధికారులు స్పందించి.. జేసీబీలతో కోళ్ల వ్యర్థాలను తొలగించి ఆ ప్రదేశంలో పంచాయతీ ఆధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు, ఎంపీడీవో పరమేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ ఈవో శ్రీహరి ఆధ్వర్యంలో జేసీబీలతో ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారి పక్కనే పేరుకుపోయిన కోళ్ల వ్యర్థాలను జేసీబీ యంత్రాలతో తొలగించారు. వాటితోపాటు పరిసరాలను పరిశుభ్రం చేశారు. స్థానిక గాలివీడు క్రాస్ వద్ద, శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కోళ్ల వ్యర్థాలను తొలగించిన ప్రదేశంలో మళ్లీ వ్యర్థాలను వేస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల అతిక్రమణ మేరకు సంబంధిత చికెన్ దుకాణదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తామన్నారు. ప్రార్థన స్థలాల పరిసరాల్లో వ్యర్థాలను వేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.
మళ్లీ మొదటకొచ్చిన కథ
అధికారులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసిన రెండు నెలల పాటు ఎలాంటి కోళ్లవ్యర్థాలు ఇక్కడ వేయలేదు. అయితే మళ్లీ గత వారం రోజులు యథావిధిగా కోళ్లవ్యర్థాలను ఇదే ప్రాంతంలో తీసుకొచ్చి పడేస్తుండడం గమనార్హం. జేసీబీలతో గతంలో పంచాయతీ అధికారులు శుభ్రం చేసిన ప్రాంతంలోనే మళ్లీ కోళ్ల వ్యర్థాలను పడేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు పంచాయతీ అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను సైతం ధ్వంసం చేయడం గమనార్హం. దీంతో ప్రతిరోజు గుడికెళ్లే భక్తులతోపాటు వాకింగ్‌కు వెళ్లే గ్రామస్తులు, పాదాచారులు ఈ మార్గంలో వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
హెచ్చరిక బోర్డులు ధ్వంసం చేసిన వైనం
ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారి పక్కన, గుడికెళ్లే మార్గంలొ కోళ్ల వ్యర్థాలను పడేస్తున్న వారిపై చర్యలు తీసుకొంటాం. చికెన్ దుకాణ దారులతో సమావేశం నిర్వహించి చర్యలు ఉల్లంఘించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం.
– రవీంద్రబాబు, ఎస్‌ఐ, గుర్రంకొండ


