మదనపల్లె టౌన్ : వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చలేక ఓ మహిళ రైతు మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శనివారం కురబలకోట మండలంలో వెలుగు చూసిన ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని అంగళ్లు పంచాయతీ పెద్ద కటపకు చెందిన శంకర భార్య లక్ష్మి(50) ఊరికి సమీపంలో కౌలుకు భూములు సాగు చేసి సుమారు 10 లక్షలకు పైగా అప్పులు చేసి పంటలను పండించింది. అయితే పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులు తీర్చలేక పోయింది. దీంతో రుణ దాతల ఒత్తిళ్లు అధికం కావడంతో అప్పు తీర్చే మార్గం లేక ఇంట్లో ఉన్న నిద్ర మాత్రల మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిక తరలించిగా డాక్టర్లు వైద్యం అందించారు. ఘటనపై ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
చౌడేపల్లె : మండలంలోని చౌడేశ్వరిదేవి పెద్దచెర్వులో మేత మేస్తున్న గొర్రెల మందపై కుక్కల గుంపు ఒక్కసారిగా దాడికి తెగబడిన ఘటన శనివారం జరిగింది. పెద్దకొండామర్రి పంచాయతీ నాగిరెడ్డిపల్లె మునివెంకటరమణారెడ్డికి చెందిన గొర్రెలను మేత కోసం చెరువులోకి తోలుకెళ్లాడు. గొర్రెలు మేత మేస్తుండగా ఒక్కసారిగా సుమారు పది కుక్కలు గొర్రెల మందపై విజృంభించాయి. గొర్రెల అరుపులు విన్న అతను కేకలు వేసినప్పటికీ కుక్కలు అతనిపై తిరగడడంతో చుట్టు పక్కల వారు గమనించి ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అప్పటికే రూ.16 వేల విలువ చేసే ఒక గొర్రె మృతి చెందగా మరో నాలుగు గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరారు. జంతువులు, మనుషులపై వీధి కుక్కలు విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నాయని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
సంబేపల్లె : మండల పరిధిలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శివకుమార్ అనే వ్యక్తి గాయపడ్డ సంఘటన చోటు చేసుకొంది. శెట్టిపల్లె గ్రామం చిన్నజంగంపల్లెకు చెందిన శివకుమార్ ద్విచక్ర వాహనంలో రాయచోటి నుంచి స్వగ్రామానికి వెళుతుండగా అదుపు తప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బాధితుడిని 108 సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


