కలికిరి : కలికిరిలో ఇందిరమ్మ కాలనీలోని 33 కేవీ లైను వైరు తెగి పడి పలు నివాసాలలో విద్యుత్ మీటర్లు, గృహోపకరణాలు కాలి బూడిదైన ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు... కలికిరి 330 కేవీ సబ్ స్టేషన్ నుంచి కందూరు, వాల్మీకిపురానికి వెళ్లే 33 కేవీ విద్యుత్ లైను ఇందిరమ్మ కాలనీలోని నివాసాల మధ్యలో ఉంది. ఈ లైను ఇటీవల గాలులకు తెగి పడింది. దీంతో వైరును పూర్తి స్థాయిలో మార్చాల్సిన విద్యుత్ సిబ్బంది రెండు మూడు చోట్ల జాయింట్ చేసి పునరుద్ధరించారు. దీంతో శనివారం మరోసారి 33 కేవీ లైను వైరు తెగి నివాసాల మీద పడింది. దీంతో నివాసాలలోని విద్యుత్ మీటర్లతో సహా మూడంస్తుల బిల్డింగ్‌లో వైరింగ్, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఫ్యాన్‌లు ఇతర గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో తెగిన విద్యుత్ లైన్ వైరు ఇంటి మీద రేకులపై పడటంతో ఇంటి వరకు మీటర్లు, గృహోపకరణాల నష్టం వాటిల్లింది. రోడ్డుపై, లేక వాహనాలపై పడింటే ప్రాణ నష్టం చోటు చేసుకుని వుండేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినా ట్రాన్స్‌కో అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపించారు. ప్రమాద ఘటన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ట్రాన్స్‌కో సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి 33కేవీ విద్యుత్ లైన్‌ను కాలనీ నుంచి తొలగించాలని స్థానికులు కోరారు.
– కాలి బూడిదైన మీటర్లు, గృహోపకరణాలు
– తప్పిన పెను ప్రమాదం


